సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు అత్తింటి వేధింపులు.. ఆత్మహత్య
అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తింటి వారు కొత్తగా అనుమానాలు లేవనెత్తి మాటలు అనడంతో వివాహిత పుట్టింట్లోనే ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఘటన జరిగింది. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పెళ్లి జీవితం నరకంగా మారింది. అదనపు కట్నం కోసం వేధింపులు, ఆ బిడ్డ ఎవరికి పుట్టాడంటూ అనుమానించడంతో పుట్టింట్లోనే ఆత్మహత్య చేసుకుంది. అద్దం పైన సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం చెందింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టిన బిడ్డకు భర్త పోలికలు రాలేదంటూ అనుమానాలతో వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది.
జగిత్యాలకు చెందిన గంగాధర్, శోభ దంపతుల కూతురు లక్ష్మీ ప్రసన్న కు రెండేళ్ల కిందట తిరుపతితో వివాహం జరిగింది. తిరుపతి స్వస్థలం వెలగటూరు మండలం రాంనూర్. కాగా, ఈ దంపతులు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. ఈ క్రమంలో ఏడాది కిందట లక్ష్మీ ప్రసన్న ఓ పండంటి బాబుకి జన్మనిచ్చింది. కొడుకు పుట్టాక ఆమె సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసి కుమారుడి ఆలనా పాలనా చూసుకుంటోంది. అయితే కొడుకు పుట్టిన తర్వాత లక్ష్మీప్రసన్నకు అత్తింటి వారి నుంచి వేధింపులు అధికమయ్యాయి. 55 లక్షలు కట్నం ఇస్తామని ఒప్పుకొని మనం 10 లక్షలు ఇచ్చారని.. భూమి అమ్మేసి మిగతా డబ్బులు ఇవ్వలేదని ఆమెను వేధిస్తున్నారు. వారం రోజుల కిందట బెంగళూరు నుంచి తిరుపతి, లక్ష్మీప్రసన్న రామ్నూరుకు వచ్చారు. అయితే, రాంనూర్ వెళ్లిన గంగాధర్ తన కుమార్తె లక్ష్మీప్రసన్న, ఏడాది మనవడిని తీసుకొని జగిత్యాలకు వచ్చారు. అదే రోజు సాయంత్రం లక్ష్మీ ప్రసన్న ఫ్యాన్ కు ఉ రేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా. వారు మృతదేహాన్ని జగిత్యాల జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తన కూతురి మరణానికి భర్త తిరుపతి, ఆమె అత్తమామలు, ఆడపడుచులే కారణమని లక్ష్మీప్రసన్న తండ్రి గంగాధర్ ఫిర్యాదు చేశారు. వారు వేధిస్తున్నారని, బాబు ఎవరికి పుట్టాడు అంటూ వేధించడంతో తన కుమార్తె చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాకు బతకాలని లేదు. నా కుమారుడు జాగ్రత్త అమ్మానాన్న.. నా బాబుని మాత్రం వాళ్లకు ఇవ్వకండి అని ఇంట్లో అద్దంపై రాసి ఆత్మహత్య చేసుకుందని గంగాధర్ ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు భర్త తిరుపతి అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే బాధ్యులను అరెస్టు చేసి ఏం చేస్తామన్నారు సీఐ వేణుగోపాల్.