ప్రైవేట్ పరం కాకుండా 400 ఎకరాలు కాపాడాం
విపక్ష పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీధర్ బాబు
ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. భూములపై కోర్టులో కొట్టాడి వాటిని దక్కించుకున్న ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పినప్పటికీ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏఐ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసి దుష్ప్రచారం చేశారు.
హెచ్‌సీయూ భూములు, పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా? విద్యార్థులను ప్రభావితం చేసి ప్రభుత్వ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు, ఉద్యోగాలు రావొద్దని కుట్ర చేస్తున్నారు. సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్ల జారీ ప్రక్రియ ఉంటుంది. ఐసీఐసీఐ నుంచి మేం ఎలాంటి లోన్లు తీసుకోలేదు. కంచ గచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదాలు లేవు. రాష్ట్ర ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసమే నిధులు సేకరిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఇదిలావుంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఖండించారు.
కేటీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. టీజీఐఐసీకి ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. టీజీఐఐసీ ఫేస్ వాల్యూ చూసి 27 కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయని, తద్వారా వచ్చిన డబ్బులే ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా టీజీఐఐసీలో పడ్డాయని వివరించారు. ఐసీఐసీఐ బ్యాంకు రుణంపై కేటీ-ఆర్ చేసిన వ్యాఖ్యలతో.. కంచ గచ్చిబౌలి భూములు.. హెచ్‌సీయూ, అటవీ శాఖవి కాదని తేలిపోయిందని కిరణ్‌కుమార్ అన్నారు. పేద ప్రజలు సన్న బియ్యం అన్నం తింటుంటే.. బీఆర్‌ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు.