మోహన్ బాబుకు హైకోర్టులో షాక్
జర్నలిస్టు మీద దాడి కేసులో నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. త్వరలోనే మోహన్‌బాబును అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
మెహన్ బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మోహన్ బాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హై కోర్టు నిరాకరించింది. మోహన్ బాబు ప్రతివాద లాయర్ మాట్లాడుతూ.. హత్యాయత్నం కేసు పెట్టడంతోనే జర్నలిస్ట్‌ను మోహన్ బాబు కలిశారని చెప్పాడు. అంతేకాకుండా మోహన్ బాబు ఎవరైనా ప్రభావితం చేయగల వ్యక్తి అని.. బెయిల్ అస్సలు ఇవ్వొద్దని ప్రతివాద లాయర్ తెలిపాడు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే మోహన్ బాబు దుబాయ్‌కు వెళ్లాడని ఆరోపించాడు.
ఈ నెల 13న మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేసిన నేపథ్యంలో పహాడీషరీఫ్ పోలీసులు ఆయనపై బీఎన్‌ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కుటుంబంలో ఆస్తి వివాదం నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. మోహన్‌బాబుతో పాటు వచ్చిన అనుచరులు, బౌన్సర్స్, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. కొద్దిసేపటి వరకు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో మరో ఛానల్ కెమెరామెన్ కూడా కింద పడ్డాడు. దీంతో దాడిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ధర్నా చేశారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుపై పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మోహన్ బాబు పై బి,యన్,ఎస్, 18క్లాజ్ 1కింద కేసు నమోదైంది.
దీంతో మోహన్‌బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. పలుమార్లు దీనిపై విచారించిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. సోమవారం మరోసారి విచారించిన న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.