- ఓడిపోయిన నైరాశ్యంలో బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారు
- నిరుద్యోగుల కోసం సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుల కృషి
బాల్క సుమన్, క్రిశాంక్‌లు సిఎం రేవంత్‌రెడ్డి పర్యటనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కెటిఆర్‌కు, బాల్క సుమన్, క్రిశాంక్‌ల మధ్య చెడినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కావాలని కెటిఆర్ కోరుకున్నారని ఆయన తెలిపారు. ఓడిపోయిన నైరాశ్యంలో బిఆర్‌ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో నిరుద్యోగుల ఉద్యోగ కల్పన కోసం సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు కృషి చేస్తున్నారన్నారు. పెట్టుబడుల కోసమే సిఎం, మంత్రులు అమెరికా వెళ్లారన్నారు. ఓర్వలేక సిఎం రేవంత్ రెడ్డిపై ఆయన కుటుంబంపై కొందరు విషం కక్కుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొడంగల్‌లో రేవంత్ రెడ్డి సమీక్ష జరిగేటప్పుడు కాంగ్రెస్ ఇన్‌చార్జీ తిరుపతి రెడ్డి అధ్యక్షత వహించారని ఆయన తెలిపారు. కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ అధికారిక పర్యటన కాదని ఆయన స్పష్టం చేశారు. ఇంకో సోదరుడుకి అమెరికాలో స్వచ్ఛ్ బయో కంపెనీ ఉందని దాని ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెడితే తప్పేంటి? దాని మీద ఎందుకు రాజకీయం చేస్తున్నారు అని ఆయన నిలదీశారు. పది సంవత్సరాల్లో కెసిఆర్ కుటుంబం మొత్తం తెలంగాణలో విస్తరించిందన్నారు.
రేవంత్ రెడ్డి ఎనిమిది నెలల్లో కుటుంబాన్ని ఎక్కడా చూపించలేదన్నారు. భద్రాచలంలో శ్రీరాముడి కల్యాణం సందర్భంగా ఆయన మనుమడు తలంబ్రాలు తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. కుటుంబ పాలన అంటే కెసిఆర్‌దని, రేవంత్ రెడ్డిది కాదని, కావాలనే బట్ట కాల్చి మీద వేస్తున్నారన్నారు. ఈ ప్రాంతం వారు మోసం చేస్తే అక్కడే బొంద పెట్టాలని, ప్రాంతీయేతరులు మోసం చేస్తే బయట బొంద పెట్టాలని కాళోజీ నారాయణ రావు చెప్పారన్నారు. అందుకే పది ఏళ్లు తెలంగాణను మోసం చేసిన కెసిఆర్‌ను ప్రజలు బొంద పెట్టారని, మరోసారి బద్నాం చేయాలని చూస్తే తామే ఏమిటో చూపిస్తామంటూ సంపత్‌కుమార్ హెచ్చరించారు.