ఇప్పటికే బిసిలు భయాందోళన చెందుతున్నారు
కోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహారించండి
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు లేఖ రాసిన
మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌గౌడ్
కులాల సర్వేను చేపట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేయడంతో బిసిలు చాలా భయాందోళనకు గురవుతున్నారని, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా బిసిల సంక్షేమం కోసం ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టలేదని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌గౌడ్ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు లేఖ రాశారు. ఎన్నికలకు ముందు బిసిల సంక్షేమం కోసం కాలపరిమితితో కూడిన కార్యక్రమాలను ప్రకటించడంతో పాటు కులాల సర్వే నిర్వహించడం అత్యంత కీలకమైన కార్యక్రమమని, అయితే కులసర్వేను నిర్వహించడంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు తమ దృష్టికి వచ్చాయని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌గౌడ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభ గతంలో 15.-03-.2024న ప్రభుత్వాన్ని కులాల సర్వే నిర్వహించాలని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని, దాని ఫలితాల ఆధారంగా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందే బిసిల రిజర్వేషన్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రం మొత్తం ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే(కులగణన) చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15వ తేదీన జిఓ నెం.26ను జారీ చేసిందన్నారు. 2024, 25 ఆర్థిక సంవత్సరం బిఈ ప్రొవిజన్ నుంచి రూ.150 కోట్లు కేటాయించినట్టు ఆయన ఆ లేఖలో తెలిపారు. అయితే కులగణన ఆలస్యం కావడం దానికి సంబంధించి కొన్ని క్లిష్టమైన సమస్యలు నెలకొన్నాయని వాటిని పరిష్కరించాలని డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌గౌడ్ ఈ లేఖలో సూచించారు.
క్లిష్టమైన సమస్యలు ఇలా…
ఆర్టికల్ 340 ప్రకారం ప్రత్యేకించి కులాల సర్వే లేదా ఏదైనా సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా, ప్రభుత్వం బిసి ప్రత్యేక కమిషన్‌ను ప్రకటించిందని ఆయన తెలిపారు. దీనివలన మరిన్ని చట్టపరమైన అడ్డంకులను సృష్టించే అవకాశం ఉందన్నారు. గతంలోనూ మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన బిసి కమిషన్‌లోనూ ఉల్లంఘన జరిగిందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆ కమిషన్ రద్దు చేసిన విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు.
అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర ప్రభుత్వం కులాల సర్వే కోసం జయత్‌కుమార్ భాటియా కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టే కులగణన సర్వేను పర్యవేక్షించడానికి ఉన్నతస్థాయి నోడల్ అధికారిని నియమించాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా పకడ్భందీగా కులగణన సర్వే నిర్వహణకు సలహాదారులుగా సంబంధిత రంగంలోని నిపుణులను చేర్చుకోవాలని ఆయన సూచించారు.