డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరును రెండు మూడేళ్లల్లో బాగు చేయడం దేవుడికి కూడా సాధ్యం కాదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బెంగళూరు నగర సమస్యలపై ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. నగరంలోని ట్రాఫిక్ సమస్య, మౌలికవసతుల కొరతను దేవుడు కూడా స్వల్ప వ్యవధిలో పరిష్కరించలేడని ఆయన అన్నారు. దీంతో, సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై రచ్చ జరుగుతోంది. అనేక మంది అధికార కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘బెంగళూరులో రెండు, మూడు ఏళ్లల్లో మార్పు తీసుకు రావడం కుదరదు. దేవుడు కూడా ఇది చేయలేడు. క్రమబద్ధమైన ప్రణాళిక, దాని అమలుతోనే ఇది సాధ్యమవుతుంది’’ అని ఉపముఖ్యమంత్రి అన్నారు. రోడ్ల నిర్మాణంపై బుధవారం జరిగిన వర్క్ షాప్‌లో పాల్గొన్న డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రాఫిక్ సమస్యలు, మౌలిక వసతుల కొరత, మెట్రో విస్తరణలో జాప్యం, అవసరాలకు తగినట్టు ప్రజారవాణా వసతి లేకపోవడంతో నగర జీవులు నిత్యం నరకం అనుభవిస్తున్న నేపథ్యంలో డీకే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రకటించినా అమలులో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోందని అంటున్నారు.
కాగా, డీకే వ్యాఖ్యలను ఆర్థికవేత్త, ఆరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఎక్స్ వేదికగా సవాలు చేశారు. బెంగళూరును మెరుగు పరచడంలో ప్రభుత్వం ఏమేరకు పురోగతి సాధించిందని సూటిగా ప్రశ్నించారు. ‘‘మంత్రిగారు.. మీరు పదవి చేపట్టి రెండేళ్లు గడిచాయి. బలమైన నేత అధికారంలోకి వచ్చినందుకు అప్పట్లో మేము హర్షించాము. కానీ మా జీవితాలు మాత్రం మరింత అధ్వాన్నంగా మారాయి. భారీ ప్రాజెక్టుల ప్రకటనలు వెలువడ్డాయి. కానీ ప్రభుత్వం ఒక్క దాన్ని కూడా సకాలంలో పూర్తి చేయలేదు’’ అని అన్నారు. తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, ప్రతిపక్ష బీజేపీ కూడా శివకుమార్ వ్యాఖ్యలపై మండిపడింది. సిద్ద రామయ్య నేతృత్వం అసమర్థమైనదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రాండ్ ‘‘బెంగళూరును సిద్ధం చేస్తానన్న వ్యక్తే ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇక మేలు చేసేది ఎవరు. ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు ఓ అవకాశం ఇచ్చాడు. కానీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి మినహా ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది’’ అన్ని బీజేపీ నేత మోహన్ కృష్ణ అన్నారు.