Wednesday, December 25, 2024

మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ

  • మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే
  • గొప్ప పండుగ బతుకమ్మ
  • ఆడబిడ్డలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • నేటి నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభం

తెలంగాణ ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని ఆయన అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సిఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకు అందరూ కలిసి పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని గౌరమ్మను సిఎం ప్రార్థించారు.

కొన్ని చోట్ల సోమ, మరికొన్ని చోట్ల మంగళవారం ప్రారంభమైన సంబురాలు

బతుకమ్మ సంబురాలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 30వ తేదీనే ప్రారంభం కావడం విశేషం. 02వ తేదీన నేడు (సూర్యగ్రహణం, అమావాస్య) కావడం, పసుపు, కుంకుమలు బయటకు పోవద్దన్న ఉద్ధేశ్యంతో కొన్నిచోట్ల సెప్టెంబర్ 30వ తేదీ, అక్టోబర్ 01వ తేదీన ఈ బతుకమ్మ సంబురాలను ప్రారంభించినట్టుగా తెలిసింది. మాములుగా తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ సంబురాలు జరుగనుండగా బతుకమ్మకు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పలహారాలను సమర్పిస్తారు. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మకు నువ్వులు, బియ్యం పిండి, సూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. 2వ రోజు అటుకుల బతుకమ్మను పురస్కరించుకొని నీటిలో నాన బెట్టిన చప్పిడి పప్పుకి బెల్లం, అటుకులు కలిపి ప్రసాదంగా చేస్తారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. నీటిలో ఉడికించిన శెనగపప్పుకి బెల్లం, పాలు కలిపి ప్రసాదంగా ఇస్తారు. 4వ రోజు నాన బియ్యం బతుకమ్మగా పిలుస్తారు. ఆరోజున నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి ప్రసాదంగా ఇస్తారు. 5వ రోజును అట్ల బతుకమ్మగా అభివర్ణిస్తారు. ఆరోజు మహిళలు నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి ప్రసాదంగా ఇస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు బతుకమ్మ ఆడరు. 7వ రోజు వేపకాయ బతుకమ్మ కావడంతో సకినాల పిండిని వేపకాయ పరిమాణంలో చిన్న చిన్న ముద్దలుగా చేస్తారు. వీటిని నూనెలో వేగించి ప్రసాదంగా ఇస్తారు. కొంత మంది పప్పు, బెల్లం కలిపి కూడా ఇస్తారు. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ రోజున బెల్లాన్ని మెత్తగా దంచుతారు. ఈ బెల్లంలో నువ్వులు కలిపిన తర్వాత వెన్న కలుపుతారు. వెన్న లేకపోతే నెయ్యి ఉపయోగిస్తారు. మూడింటినీ బాగా కలిపిన తర్వాత ముద్దలు చేస్తారు. ఈ వెన్న ముద్దలను నైవేధ్యంగా పెడతారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ ఐదు రకాల పద్దులను నైవేధ్యంగా పెడతారు. అందుకే ఇది సద్దుల బతుకమ్మ, దద్దోజనం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పుట్నాలను పొడి చేసి అన్నంతో పద్దులు కలుపుతారు.

మంగళవారం పలుచోట్ల పెద్దల అమామాస్య

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెత్తరామాస (పితృ అమావాస్య/ పెద్దల అమామాస్య) జరుపుకోనున్నారు. ఈ పెత్తరమాస సందర్భంగా చాలామంది పితృ దేవతలకు బియ్యం ఇస్తుంటారు. ఈ క్రమంలోనే కాలం చేసిన తండ్రులు, తాతలకు నైవేధ్యాలు సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మకు పది రోజుల ముందు కాలం చేసిన కుటుంబ పెద్దలను తలుచుకొని వారికి బియ్యం ఇస్తూ, అన్ని రకాల వంటకాలతో నైవేధ్యాలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా మటన్, చికెన్‌తో పాటు మద్యం కూడా నైవేధ్యంగా పెడుతుంటారు. కానీ, నేడు నైవేధ్యంగా పెట్టేందుకు ఇవేవీ దొరకవు. వైన్స్‌లతో పాటు మాంసం దుకాణాలు కూడా తెరుచుకోవు. నేడు అక్టోబర్ 02వ తేదీ మహాత్మా గాంధీ జయంతి కావటంతో ఇవన్నీ మూసివేస్తారు. ఈ నేపథ్యంలోనే కొన్నిచోట్ల మంగళవారం చాలా మంది పితృ దేవతలకు బియ్యం ఇచ్చినట్టుగా తెలిసింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com