అమాయకులను నిట్టనిలువనా దోపిడీ చేస్తూ.. వారి ప్రాణాలను బలిగొంటున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్ నివాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్ల మెడకు కేసుల ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. ఈ కేసు విచారణ లోతుగా వెళ్ళే కొద్దీ మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు రావడం గమనార్హం. బెట్టింగ్ యాప్స్ నిర్వహకులు భారీగా ఆదాయాన్ని గడిస్తూ.. నిమిషానికి రూ. 90 వేలు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఒక్కోక్కరు 15 యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. వారందరి లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ నిర్వహకుల ఖాతాల్లోకి భారీగా సొమ్ములు చేరినట్లుగా గుర్తించారు.
కొంతమంది టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయర్స్ సహా మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. వారిలో ప్రముఖ సినీ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయర్స్‌లో అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, విష్ణుప్రియ, హర్షసాయి, పద్మావతి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజా, రీతూ చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయర్స్, సెలబ్రెటీలపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపించారు. దీనిలో భాగంగా గురువారం విచారణకు ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ తన లాయర్‌తో హాజరయ్యారు. అలాగే మరో నటి రీతూ చౌదరీ హాజరయ్యారు. కాగా మరికొంతమంది యూట్యూబర్లు విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కోరినట్లు సమాచారం. ఈ బెట్టింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం కావడంతో ఇకపై బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయమని కొందరు యూట్యూబర్లు, సినీ ప్రముఖులు ఎక్స్ వేదికల ద్వారా ప్రకటనలు చేశారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ విచారణలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో భాగంగా భారీగా డబ్బులు వచ్చినట్లు విష్ణుప్రియ అంగీకరించినట్లు సమాచారం. దాదాపు 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు, నిమిషం వ్యవధితో చేసే ఒక్కో వీడియోకు రూ. 90 వేలు వరకు వసూలు చేసినట్లుగా ఆమె అంగీకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె ఫోన్‌ను పోలీసు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం మరో యూట్యూబ్ స్టార్ రీతూ చౌదరీని పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో తనకు తెలిసో తెలియకో తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశానని ఒప్పుకుంటా అని ఒక వీడియోను రీతు చౌదరి విడుదల చేయడం గమనార్హం. అయితే అవన్నీ గతంలో చేశానని, బెట్టింగ్ యాప్స్ ను ఎవరూ నమ్మకండ్ అని ఆమె పేర్కొన్నారు.
2016లో ఆ యాడ్ చేసిన మాట వాస్తవమే – నటుడు ప్రకాశ్ రాజ్
2016లో తాను ఓ యాడ్ చేసిన మాట వాస్తవమేనని సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఒప్పకుంటూ ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. అలాంటి యాడ్ ఎలా చేస్తారని తనను చాలమంది ప్రశ్నించడంతో తన తప్పు తెలుసుకుని మరుసటి ఏడాదికి ఆ యాడ్ చేయనని నిర్వహకులకు చెప్పేశానని అన్నారు. అయితే ఇప్పుడు ఆ వీడియోను బయటకు తీశారని, అందుకే తాను వివరణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, ఒకవేళ నోటీస్ వస్తే వివరణ ఇస్తాన్నారు. గేమింగ్స్ యాప్స్ ఒక వ్యసనమని, ఎవరూ వాటి జోలికిపోవద్దని, జీవితాన్ని పాడుచేసుకోవద్దని ప్రకాశ్ రాజ్ విజ్ఞప్తి చేశారు.
స్కిల్ బేస్ట్ గేమ్స్‌కు మాత్రమే విజయ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్
స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడానికి అధికారికంగా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన పీఆర్ టీం ఓ నోట్‌ను విడుదల చేసింది. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా సరే ఆ కంపెనీని లీగల్‌గా నిర్వహిస్తున్నారా లేదా అనే అంశాన్ని ఆయన టీమ్ పరిశీలిస్తుందని నోట్‌లో పేర్కొన్నారు. కంపెనీ ప్రొడెక్టుకు చట్టప్రకారం అనుమతి ఉందని తేలిన తర్వాత సదరు యాడ్‌కు ప్రచారకర్తగా ఉంటారని, అలా అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ పనిచేశారని ఆయన టీం వెల్లడించింది. అయితే అతని ఎండార్స్ మెంట్ వ్యవధి 2023లో ముగిసిందని, ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అక్రమంగా ఏ సంస్థకూ విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పనిచేయడం లేదని, ఈ నేపథ్యంలో పలు మాధ్యమాల్లో ప్రసారమవుతోన్న అపోహాలు, తప్పుడు సమాచారంలో వాస్తవం లేదని ఆయన టీం వెల్లడించింది.