Friday, November 15, 2024

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం రేవంత్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ మరోసారి బిఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రాచలం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. తెల్లం వెంకట్రావుతో పాటు ఆయన సహచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో బిఆర్‌ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీకి నష్టమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే గతంలో భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశానికి హాజరవ్వడంతోపాటు శనివారం తుక్కుగూడలో నిర్వహించిన జన జాతర బహిరంగ సభకు కూడా తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అధికారికంగా సిఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సొంత పార్టీతో అంటీముట్టనట్టుగా…
2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి తెల్లం గెలుపొందారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కొంతకాలంగా సొంత పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహారిస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ఛలో మేడిగడ్డ కార్యక్రమం, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత సమావేశాలకు దూరంగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తెల్లం, కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ వచ్చారు.

ఇటీవల మణుగూరు కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తమతో కలిసి నడుస్తానంటూ వచ్చారని ఆయన తెలిపారు. కాగా గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తెల్లం వెంకట్రావ్ మాత్రమే బిఆర్‌ఎస్ తరపున గెలిచారు. మిగతా 9 స్థానాల్లో కాంగ్రెస్ 8, సిపిఐ 1 స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular