మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత కె కె రాధామోహన్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మా సహా నిర్మాత శ్రీధర్ గారు, దర్శకుడు హర్ష ఈ కథతో గోపీచంద్ గారి దగ్గరకి వెళ్లారు. గోపీచంద్ గారికి కథ చాలా నచ్చింది. ఇంతకుముందు గోపీచంద్ గారితో పని చేశాం. ఆ అనుబంధంతో ఆయన నన్ను సజెస్ట్ చేశారు. తర్వాత నేనూ కథ విన్నాను. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. గోపీచంద్ గారు ఇంతకుముందు పోలీస్ పాత్రలు చేశారు కానీ ఈ పాత్ర చాలా డిఫరెంట్. చాలా కొత్త జోనర్ లో వుండే కథ ఇది. ఈ జోనర్ గోపి గారు గతంలో చేయలేదు. ప్రస్తుతం ప్రేక్షకుల ఇలాంటి కథలని గొప్పగా ఆదరిస్తున్నారు. తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకంతో ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాం. కథలో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వున్నాయి. ట్రైలర్ లో పోలీస్ కాకుండా గోపిచంద్ గారి మరో గెటప్ చూసి ప్రేక్షకులు చాలా ఎక్సయిట్ అవుతున్నారు.
అది ఏమిటనేది మార్చి 8న తెలుస్తుంది. ‘అఖండ’ కి భీమాకి ఏ మాత్రం పోలిక లేదు. భీమాలో చూపించిన పరశురామక్షేత్రం బెంగళూరు, బాదామి పరిసరప్రాంతాల్లో వుంటుంది. అక్కడ జరిగే కథ ఇది. శివాలయం, అఘోరాలను యాంబియన్స్ కోసం చూపించాం. అఘోరాలకు కథతో సంబంధం లేదు. కథ, జోనర్ పరంగా ఇది చాలా డిఫరెంట్ మూవీ. ప్రతి ప్రాజెక్ట్ నిర్మాతకు రిస్కే. అయితే మనం ముందు కథని నమ్మాలి. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు కథ ఉందా లేదా? ప్రాజెక్ట్స్ కి సరిపడా నటీనటులు ఎవరు? ఎలాంటి సాంకేతిక నిపుణులు ఎంచుకోవాలని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే. హర్ష చాలా క్లారిటీ వున్న దర్శకుడు. తను కొరియోగ్రఫర్ కూడా. మా బెంగాల్ టైగర్ సినిమాకి చేశారు. భీమాని చాలా అద్భుతంగా తీశారు. అలాగే ఇందులో రెండు పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు.
ఈ సినిమా మంగుళూరు, బాదామి, ఉడిపి, మారేడుమిల్లి, వైజాగ్ ఇలా చాలా డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. అన్నపూర్ణలో ఒక భారీ టెంపుల్ సెట్ ని క్రియేట్ చేశాం. కథకు తగ్గట్టుగా ఎక్కడా రాజీపడకుండా తీశాం. మేము అనుకున్న క్యాలిటీ ఇవ్వగాలిగాం. దాని కారణంగా బడ్జెట్ పెరిగింది. భీమా బిజినెస్ పరంగా హ్యాపీగా వున్నాం. టీజర్ ట్రైలర్ చాలా మంచి బజ్ క్రియేట్ చేశాయి. అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యుటర్స్ సినిమాపై చాలా ఆసక్తి చూపించారు. పెద్ద సంఖ్యలో రిలీజ్ చేస్తున్నారు. గోపీచంద్ గారి కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్. ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ కూడా క్లోజ్ చేశాం. ట్రైలర్ లో చూపించినట్లుగా ఇందులో గోపిచంద్ గారిది బ్రహ్మరాక్షుడి క్యారెక్టరైజేషన్ గానే వుంటుంది. అయితే కథలో సిట్యువేషనల్ కామెడీ వుంటుంది. చిన్న లవ్ ట్రాక్ కూడా వుంది. కఠినమైన పోలీసు అధికారి ఇంట్లో కూడా కఠినమైనంగా వుండరు కదా. అలాంటి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేశాం.