తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణపై స్టే ఇచ్చింది. ఈ భూములను సేకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని లగచర్ల, హకీంపేటలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది నవంబర్ 11న ఫార్మా కంపెనీల ఏర్పాటు సంబంధించి భూసేకరణ కోసం లగచర్ల సమీపంలో కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై ఒక్కసారిగా కొందరు దాడులకు దిగారు. వారి వాహనాలను పెద్ద పెద్ద బండరాళ్లతో ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా.. అధికారికంగా పెద్ద దుమారం రేపింది. భూ సేకరణపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేసిన న్యాయస్థానం ప్రభుత్వానికి షాక్ ఇస్తూ.. నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
గతంలో ఫార్మా సిటీ నోటిఫికేషన్ రద్దు..
లగచర్ల ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి కుట్ర చేశారన్న అభియోగాలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు, రైతులు కూడా అరెస్ట్ అయ్యారు. ఫార్మాసిటీని రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది. నవంబర్ 30న అదే ప్రాంతంలో మల్టీ పర్పస్ పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన భూసేకరణను ప్రారంభించింది. అయితే.. పలువురు ఈ భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.