ధరణిని రీప్లేస్ చేయబోతుంది భూ భారతి. అంబేద్కర్ జయంతి రోజున అధికారికంగా సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల్లో అమలు చేయనుంది ప్రభుత్వం. ఆర్వోఆర్-2020 స్థానంలో ఆర్వోఆర్-2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు ధరణి స్థానంలో.. భూ భారతి పోర్టల్ సైతం అందుబాటులోకి రానుంది. మొదట మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తారు.నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా… హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త చట్టం, పోర్టల్‌ను ఆవిష్కరించేందుకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త చట్టం అమలు, నియమ నిబంధనలపై ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
గందరగోళానికి తావు లేకుండా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్ భూ భారతిని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. గతంలో ధరణిలో 33 మాడ్యూళ్లు ఉన్నాయి. రైతులు పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్‌ను ఎంపిక చేస్తే ఇబ్బందులు ఎదురుయ్యేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు రాకుండా.. ఈ గందరగోళానికి ముగింపు పలికేలా.. కొత్త పోర్టల్‌లో మాడ్యూళ్ల సంఖ్యను ఆరుకు కుదించారు. వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందులో ఉంది. దీంతోపాటు ఈ-పహాణీని 11 కాలమ్‌లతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహాణీ తీసుకొచ్చారు. దాని స్థానంలో యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నంబరు, అనుభవదారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా తదితర వివరాలు తెలిపేలా పహాణీ ఉండనుంది.
భూ భారతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సామాన్య రైతుకు కూడా భూ భారతి అర్థం అయ్యేలా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం. నిర్వహణ బాధ్యతలను మంచి సంస్థకు అప్పగించాలని, కనీసం వందేళ్లపాటు వెబ్‌సైట్ ఉంటుందన్నారు రేవంత్. భద్రతాపరమైన సమస్యలు రాకుండా చూడాలన్నారు ఆయన. అవగాహనా సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు సీఎ ఆదేశం జారీ చేశారు.
మూడు మండలాల్లో తొలుత ఈ పోర్టల్‌ను పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ఒక్కో మండలాన్ని ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా మండలాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. తర్వాత రాష్ట్రంలోని ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా పోర్టల్ సులభమైన భాషలో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ పోర్టల్ ను అప్‌డేట్ చేయనున్నారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశించారు.
రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించేందుకు భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల భూముల పరిరక్షణ బాధ్యత ఈ ప్రభుత్వానిదే అన్నారు ఆయన. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని తామిచ్చిన హామీని విశ్వసించి ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారన్నారని.. ఇప్పుడా హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. భూ భారతి చట్టాన్ని తీసుకురావడం.. ఇందులో రెవెన్యూశాఖ మంత్రిగా తనకు భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చినందుకు తన జన్మ ధన్యమైందన్నారు మంత్రి పొంగులేటి. మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేసిన తర్వాత.. వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ తేదీ నాటికి పూర్తిస్ధాయిలో అమలు చేయనున్నారు. అంతేకాదు 2029 శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం తమకు రిఫరెండమని గతంలో శాసనసభలోనే ప్రకటించామని గుర్తు చేశారు.
భూములపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఒక భరోసా, భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామంటున్నారు మంత్రి పొంగులేటి.
భూభారతి అమలు విషయంపై మంత్రి పొంగులేటి ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. భూ యజమానులు తమ భూమి వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్‌ను సందర్శించవద్దని.. దీని వలన మొత్తం పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. అంతేగాక కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్‌ను ఆగిపోయేలా చేయాలని ప్రయత్నిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు.
కొత్త పోర్టల్ డెవలప్ చేస్తున్నా.. రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు అధికారులు. గతంలో ధరణిని తీసుకువచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని… ఇప్పుడు ఆ పరిస్ధితి లేకుండా క్రమక్రమంగా పోర్టల్‌ను అభివృద్ది చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం, పోర్టల్ అమలుకు సంబంధించి ఎంపిక చేసిన ప్రయోగాత్మక గ్రామాలలో స్వయంగా తాను పర్యటిస్తానన్నారు పొంగులేటి.
భూభారతిలో ఎమ్మార్వో స్ధాయి నుంచి సిసిఎల్ వరకు దాదాపు ఐదు స్ధాయిలలో.. భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాలు వికేంద్రీకరణ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు. తర్వాత కాలంలో సమస్యలు తగ్గితే ట్రిబ్యునల్స్‌ను కుదించనున్నారు. ధరణిలో గతంలో ఉండే 33 మాడ్యూల్స్‌ను ఆరు మాడ్యూల్స్‌కు తగ్గించింది ప్రభుత్వం. దీంతో పోర్టల్ సులభతరంగా ఉంటుందని చెబుతున్నారు.