* ఈ సారి ఐటీ పన్ను రేట్లలో భారీ మార్పులు
* ఆదాయ పన్ను రేట్లను తగ్గించే యోచనలో మోదీ సర్కార్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రేడీ అవుతోంది. దీంతో ఈ సారి వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో ఊరట లభిస్తుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సారి బడ్జెట్ లో ఆదాయపు పన్ను శ్లాబుల్లో మాభారీ మార్పులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. రాబోయే బడ్జెట్‌లో కొంతమేర ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని మోదీ ప్రభుత్వం యేచిస్తోందని సమాచారం. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు బీజేపీ ఆశించినమేరకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడంతో.. ప్రభుత్వాన్ని నడిపే విషయంలో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రధానంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆదాయాలు తగ్గడం వంటి విషయాల్లో దేశంలోని కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఈ పరిస్థితికి కారణమని పోస్ట్ పోల్ సర్వేలు చెప్పకనే చెబుతున్నాయి. ఇటువంటి సమయంలో బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమవుతున్న కేంద్రప్రభుత్వం.. వారికి ఊరటనిచ్చే విధంగా ఐటీ పాలసీని రూపొందించనుందని సమాచారం. ఉద్యోగులు, మధ్యతరగతి ఆదాయాలు, వారి జీవనశైలిని పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ సైతం చెప్పడం గమనార్హం.
మధ్యతరగతికి ఊరటనివ్వడంతో పాటు వారి పొదుపును పెంచేందుకు మోదీ సర్కార్ ఆలోచన చేస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే 15 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న వారికి ఊరట ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం 15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 5 నుంచి 20 శాతం మధ్య పన్ను స్లాబ్ ఉండగా, 15 లక్షలు పైబడిన వారికి గరిష్ఠంగా 30 శాతం ట్యాక్స్ స్లాబ్ అమలవుతోంది. ఇక 10 లక్షల వార్షికాదాయం పైనా పన్ను రేట్లు తగ్గించే దిశగా కేంద్రం ఆలోచన చేస్తోందని తెలుస్తోంది.