బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు భూపాలపల్లి సెషన్స్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ వ్యవహారంలో నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ డ్యామేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్‌ను సెప్టెంబర్ 5న విచారిస్తామని తెలిపింది. ఈ విచారణకు హాజరుకావాలని కేసీఆర్, హరీశ్ రావు సహా 8మందికి నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై గతేడాది అక్టోబరు 25న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పిటిషనర్ తెలిపారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ, డీజీపీకి కూడా కంప్లైంట్ చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అందుకే కోర్టు ముందుకు వచ్చినట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
విచారణకు హాజరవుతారా?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ డిజైన్, నిర్మాణం, నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాల్లో అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్‌రావు సహా పలువురు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్‌లో తెలిపారు. కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీంతో ఈ ఎనిమిది మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నోటీసులు జారీచేశారు. సెప్టెంబరు 5న జరిగే విచారణకు వీరంతా హాజరవుతారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది.
హైకోర్టు ఆదేశాలతో..
ఈ అంశంపై రాజలింగమూర్తి తొలుత ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దాంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. జిల్లా కోర్టులో రివిజన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ క్రమంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశాడు. బ్యారేజీలోని ఏడవ బ్లాకులో పిల్లర్ భూమిలోకి కుంగిపోవడం, పెద్ద శబ్దంతో ఒక పిల్లర్‌కు పగుళ్ళు రావడంతో అసిస్టెంట్ ఇంజినీర్ తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారన్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. కానీ ఆ మరుసటి రోజే దాన్ని క్లోజ్ చేశారని కోర్టుకు తెలిపారు.