Sunday, September 29, 2024

గులాబీకి మండలి గండం

* గులాబీకి మండలి గండం
* కాగు దిగేందుకు సిద్ధమవుతున్న ఎంఎల్ సీలు
* అదే దారిలోనే వెళ్లనున్న శాసనసభ్యులు
బీఆర్ఎస్ పార్టీకి శాసనమండలి గండం వెంటాడుతోంది. ఏ క్షణంలోనైనా ఆ పార్టీకి చెందిన మండలి సభ్యులు గులాబీ బాస్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.  పెద్దసంఖ్యలో వారు కారును వీడి హస్తం గూటికి చేరుకోనున్నారు. ఈ మేరకు అధికార పార్చీ నేతలతో రహస్య మంతనాలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. చర్చలు పూర్తిగా సఫలీకృతం కావడంతో బీఆర్ఎస్  కు చెందిన పలువురు ఎంఎల్ సీలు….కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకు రెఢీ అవుతున్నారు.  శాసనమండలిలో మొత్తం 40మంది సభ్యులుండగా వీరిలో 29మంది బీఆర్ఎస్ పార్టీవారే. కాంగ్రెస్‌కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలే ఉన్నారు.   ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం శాసనసభలో బిల్లులకు ఆమోదం తెలిపినా.. శాసన మండలిలో మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ సభ్యులు ఆమోదం తెలిపే అవకాశం ఉండదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవు.
 త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఎలాగైనా గులాబీదళం బలం తగ్గించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గట్టి కసరత్తు చేస్తోంది.  ఇందులో భాగంగానే గులాబీ పార్టీకి చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు ముమ్మర  ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చజరుగుతుంది.
ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటుకూడా గెలుచుకోలేకపోయింది. దాదాపు తొమ్మిది సెగ్మెంట్లలో ఆ పార్టీ డిపాజిట్లను కూడా కోల్పోయింది. ఇక రెండు, మూడు స్థానాల్లోనే ఆ పార్టీ రెండవ స్థానంలో నిలిచిదంటే…. పార్టీ పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకోవచ్చు.  ఈ పరిస్థితిని చూసే పలువురు నేతలు…..కారు దిగాలన్న యోచనలో  పార్టీమారుతున్నారన్న ప్రచారంతో గులాబీ పార్టీకి మరో టెన్షన్ మొదలైంది. మెజార్టీ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరుతారన్న ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి కారెక్కిన వారంతా ఇప్పుడు హస్తం పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. వీరంతా  రానున్న  బడ్జెట్ సమావేశాల్లోపు  కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ప్రస్తుతం మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి  ఇటీవల కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జోరుగా వినిపించింది. కానీ అనివార్య కారణాల వల్ల ఇది ఆగిపోయింది. అయినప్పటికీ గులాబీ నేతలతో ఆయన అంత సఖ్యతో ఉండడలేకపోతున్నారు.
 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు గులాబీ పార్టీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు.  అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా గులాబీ నేతలతో సమన్వయం లేకపోవటంతో గుత్తా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం దాదాపు అసాధ్యమన్న ప్రచారం సాగుతోంది. ఇక ఎమ్మెల్సీలుగా ఉన్నపట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ చాలా రోజులుగా డిమాండ్ చేస్తుంది. కానీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దీనిపై నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచుతూ వస్తున్నారు. ఇలాంటి పరిణామాలన్నింటిని బేరీజు వేసుకుంటున్న హస్తం పార్టీ శాసన మండలిలో బీఆర్ఎస్ కు షాకిచ్చే ప్లాన్ చేస్తోంది. మండలి సభ్యులపై అనర్హత వేటు పడకుండా ఒకేసారి బీఆర్ఎస్ శాసనసభ మండలి సభా పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు టాక్. మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను హస్తం పార్టీలో చేరేందుకు సమన్వయం చేసే బాధ్యతలు ఓ ఎమ్మెల్సీకి అప్పగించినట్లు తెలుస్తోంది. మరికొద్దిరోజుల్లోనే మండలి సభ్యుల వలసలపై స్పష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది.
కారు వీడి కాంగ్రెస్ లో చేరితో రాజకీయ భవిష్యత్తు బాగుటుందని అనేక హామీలు కూడా ఇస్తున్నారని తెలుస్తోంది.
దీంతో పలువురు ఎంఎల్ సీలు  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు  సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కొందరికి పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్ చేస్తే వారినుంచి సరైన సమాధానం రాలేదని.. అలాగని పార్టీలో కొనసాగుతామని కూడా చెప్పలేదని సమాచారం.  దీంతో 29మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలలో కనీసం 10మందైనా మిగులుతారా అనే సందేహం కారు పార్టీని ప్రస్తుతం ఖంగారుపెడుతోంది.
మండలిలో వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న ఆరుగురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా పేరుగాంచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ భవిష్యత్తుకోసం పార్టీ మారేందుకు వీరు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తీరును, టికెట్ల కేటాయింపును వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ బహిరంగంగానే తప్పుబట్టారు. ఆయన నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ కంచుకోటగా మారడంతో పార్టీమారాలని అనుచరగణం ఒత్తిడి చేస్తోంది. మరో ఎమ్మెల్సీపై కూడా అనుచరులు పార్టీ మారాలని ఇలాగే ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోకి వస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని రేవంత్‌కు సన్నిహితుడైన ఎమ్మెల్యే ఒకరు ఆ ఎమ్మెల్సీకి చెప్పినట్టు తెలిసింది. ఈ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీకి కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన కూడా కాంగ్రెస్‌లోకి జంప్ చేసే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. రెండుమూడు నెలల క్రితమే వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత బసవరాజు సారయ్య హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని చర్చ జరిగింది. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు రాజకీయంగా మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అండదండలు ఉండటంతో ఆమె చేరిక లాంఛనమే కావొచ్చన్న వాదనకూడా వినిపిస్తోంది.
పక్క చూపులు చూస్తున్న శాసనసభ్యులు
ఎంఎల్ సీల బాటలోనే కొందరు శాసనసభ్యులు సైతం గులాబీ పార్టీని వీడాలన్న యోచనలో ఉన్నారని తెలుస్తోంది. వారిలో పలువురు మాజీ మంత్రులు…ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యులు కూడా ఉన్నారని సమాచారం. ఇక గ్రేటర్ పరిధిలోని ఎంఎల్ఎలు కూడా గులాబీ టాటా చెప్పి…..కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు  సిద్ధమవుతున్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ను పూర్తిగా ఖాళీ చేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదనుపెడుతోంది. ఇప్పటికే పలువురు శాసనసభ్యులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాలను సైతం కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లుగా తెలుస్తోంది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా లో అగ్రనాయకుడిగా కొనసాగుతున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం  బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలు ఉన్నట్లు గులాబీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే కారు పార్టీ త్వరలోనే పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఉలిక్కిపడ్డ ఆ పార్టీ అధినేత కేసీఆర్  వారిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  పార్టీని వీడొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలోనే పార్టీకి మంచి రోజులు వస్తాయని…వారిలో విశ్వాసం కల్పించేందుకు యత్నిస్తున్నారు. ఎలాంటి పరిణామాలైన ధైర్యంగా ఎదుర్కొందామని…..పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మాత్రం…..సారీ సార్ అంటూ సున్నితంగా తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular