-
మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోషాక్
-
బొమ్రాసిపేట పెద్ద చెరువులో కూల్చివేతలు
మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు.
నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వేనంబరు 82, 83లలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం తెలిసిందే. అయితే రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడుకు.. మరో 15మంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ భూమిలోకి వెళ్లి బ్లూ షీట్స్ వేసుకున్నామని, దీంతో మల్లారెడ్డి వచ్చి మాపై దాడులు చేసి పోలీసుల ముందే మేము వేసిన బ్లూ షీట్స్ తొలగించారని, పోలీసుల ముందే మమ్ముల్ని చంపేస్తామని మల్లారెడ్డి బెదిరించారని తాజాగా బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదం సాగుతుండగానే.. బొమ్రాసిపేట్లో మల్లారెడ్డి నిర్మాణాలపై అధికారులు శుక్రవారం తనిఖీలు చేసి, కూల్చివేశారు.