Thursday, December 12, 2024

Wajedu SI Harish suicide case ప్రేమ.. మోసం

వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

ములుగు జిల్లా వాజేడులో ఎస్సై హరీష్ ఆత్మహత్య తీవ్ర సంచలనంగా మారింది. ఓవైపు జిల్లాలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ విషయంపై చర్చ నడుస్తుండగానే ఎస్సై ఆత్మహత్య పోలీసు వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఓ హైదరాబాద్‌ యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మిస్డ్‌ కాల్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ఇప్పుడు ఆయన ప్రాణాల మీదుకు వచ్చిందని అంటున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఇద్దరి మధ్య దూరం తగ్గి ప్రేమ ఏర్పడిందని అదే ఇప్పుడు ఎస్సై ప్రాణాలు తీసిందని అంటున్నారు. ఈ మేరకు యువతిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.

మరికొద్ది రోజుల్లో నిశ్చితార్థం చేసుకొని ఇంటివాడు కాబోతున్న ఎస్సై హరీష్ ఆత్మహత్య రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఒక్కరోజులోనే కీలక ఆధారాలు సేకరించారు. హరీష్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చారు. ఏడు నెలల క్రితం హరీష్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. పరిచయం చేసుకున్న ఆ యువతి మాటలు కలిపింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.

ఫోన్‌లో కాలింగ్ సోషల్ మీడియాలో ఛాటింగ్ దాటి ప్రేమ చిగురించింది. హైదరాబాద్‌లో ఉండే ఆమె తరచూ వాజేడు వచ్చేదని పోలీసులు తేల్చారు. వారంతాల్లో హరీష్‌లో షికార్లు చేసేదని గుర్తించారు. పీకల్లోతు ప్రేమలో ఉన్న హరీష్‌ ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. పెళ్లికి ఆమె కూడా ఓకే చెప్పింది. విషయం తెలుసుకున్న సన్నిహితులు ఆమె ఎవరు ఏంటీ అనే వివరాలు ఆరా తీశారు. ఆమెది సూర్యపేట జిల్లా చిలుకూరు మండలం నివాసి. ఆమె గురించి వాకాబు చేస్తే షాకింగ్ విషయాలు తెలిశాయని అంటున్నారు.

ఇప్పటికే మోసం
ఇప్పటికే ఆ యువతి ఇద్దరు ముగ్గుర్ని మోసం చేసిందని హరీష్‌కు తెలిసింది. ఈ ప్రేమ పెళ్లి విషయంల పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయినట్టు తెలుసుకున్నాడు. దీంతో ఆమెతో పెళ్లి వద్దనుకున్న హరీష్‌ ఇంట్లో చూసిన సంబంధం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. హరీష్‌ వేరే పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న యువతి నిలదీసింది. మాట్లాడేందుకు వాజేడు వచ్చింది. ఆదివారం వచ్చిన యువతి, హరీష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

తనతో పెళ్లికి అంగీకరించకుంటే విషయాన్ని బహిర్గంత చేస్తానంటూ యువతి బెదిరించింది. ఉన్నతాధికారులతో చెబుతానంటూ హెచ్చిరించింది. ఇది బూమ్‌రాంగ్ అవుతుందని భయపడిపోయిన హరీష్‌ ఒత్తిడి గురయ్యాడు. ఏం చేయాలో తెలియక పరువు పోతుందని అనుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయంపై హరీష్ ఫ్యామిలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చివరకు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. తమ కుమారుడి మృతికి ఆ యువతి కారణమంటూ హరీశ్‌ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular