అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. బీహార్‌కు కేంద్రం బడ్జెట్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌లో తన మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రంలో ప్రత్యేక మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు మఖానా పండించే రైతులకు సాంకేతిక, ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
మఖానా ఉత్పత్తిలో బిహార్ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంది. చాలా ఏళ్లుగా బీహార్ రైతులు మఖానాను పండిస్తున్నారు. దేశంలో 90 శాతం మఖానా బిహార్‌లో మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఉత్తర బిహార్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు. అయితే, దీన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో మఖానా పరిశ్రమకు ఊతమిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్‌కు కేంద్రం ఈ బడ్జెట్ గిఫ్ట్ ఇచ్చిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.