ముంబైలో ఓ మహిళకు బిర్యాని తింటుంటే గొంతులో ఎముక ఇరుక్కుని ఆపరేషన్‌కు 8లక్షలు ఖర్చు అయింది. రూబీ షేక్ అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి ఫిబ్రవరి 3న రెస్టారెంట్‌కు వెళ్లింది. అందరితో కలిసి బిర్యాని ఆరగిస్తుంటే ఓ ఎముక ఆమె గొంతులో ఇరుక్కపోయింది. దాంతో అక్కడి నుంచి వెంటనే ఆమె ఆసుపత్రికి చేరుకుంది. వైద్యులు పరీక్షించి సీటీ స్కాన్ చేయాలని తెలిపారు. కానీ ఆమె దాన్ని చాలా తేలికగా తీసుకుని అవసరం లేదని ఇంటికి వెళ్ళిపోయింది. రెండు రోజుల తరువాత తీవ్ర జ్వరం హైబీపీతో ఆసుపత్రికి వచ్చింది. దాంతో వైద్యులు సీటీ స్కాన్ చేయించమని చెప్పగా.. ఓ ఎముక ఆమె గొంతులో ఇరుక్కున్నట్లు తెలిపారు. దీంతో దాదాపు 8 గంటల పాటు ఆపరేషన్ చేసి ఆ ఎముకను బయటకు తీశారు. అయితే, గొంతులోకి చేరిన ఆహారం ఏదైనా కిందికి జారుతుందని, అందుకు విరుద్ధంగా ఈ ఘటనలో ఎముక గొంతు పైభాగానికి ప్రయాణించిందని వైద్యులు తెలిపారు. మత్తుమందు ఇచ్చినపుడు పేషెంట్ రూబీ దగ్గడం వల్ల గొంతులోని ఎముక పైకి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ కు మొత్తం 8 లక్షల బిల్లు అయిందని రూబీ భర్త చెప్పారు. స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లు అందించిన విరాళాలతో ఈ మొత్తం పోగేసినట్లు వివరించారు. కాగా, ఈ ఆపరేషన్ తర్వాత 21 రోజుల పాటు గొంతులో అమర్చిన ప్రత్యేకమైన పైప్ ద్వారానే రూబీ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. నెల రోజుల తర్వాతే కోలుకున్నానని ఆమె చెప్పింది.