-
సంక్లిష్ట పరిస్థితుల్లో దేశం
-
రాజ్యాంగం మార్చాలనే లక్ష్యంతో బీజేపీ
-
పటాన్ చెరు కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి
టీఎస్, న్యూస్ :దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని, రాజ్యాంగం మార్చాలనే లక్ష్యంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని, మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని బీజేపీ యత్నిస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తూనే ఉన్నారని, పెద్దవాళ్లు వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఇస్తారేమో, పటాన్చెరు వరకు మెట్రో, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఇస్తారేమో అనుకున్నా కానీ ఇదేమీ ఇవ్వలేదన్నారు. ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే మనకు పెట్టుబడులు వస్తాయని, బీజేపీ మాత్రం గొడవలు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి ప్రాతిపదికన జరగడంలేదని, రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన జరుగుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టి కత్తులతో పొడుచుకునేలా బీజేపీ కుట్రలు చేస్తోందని అన్నారు. రాష్ట్రానికి వచ్చి ఏం ఇవ్వకుండా.. హిందూ ముస్లింల మధ్య కొట్లాట పెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారని, ప్రజలు కత్తులతో పొడుచుకుని రక్తం చిందించాలని చూస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఇక్కడికి పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలి… ప్రజలు కలిసిమెలిసి ఉండాలని, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలని సీఎం సూచించారు.
ఈ పటాన్చెరు మినీ ఇండియా అని, దేశంలో ఎన్ని భాషలు, కులాలు ఉన్నాయో అందరూ ఇక్కడే కలిసి మెలిసి ఉన్నారని అన్నారు. ఇక్కడి సమస్యలపై చట్ట సభల్లో మాట్లాడాలన్నా, ఢిల్లీలో పోరాటం చేయాలంటే నీలం మధును గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 50 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేసిందో, 2024 నుంచి 2034 వరకు అదే స్థాయిలో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందని, ఈసారి మెదక్ పార్లమెంట్ బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ కొత్తవాళ్లు కారన్నారు.
కోట్లతో టిక్కెట్
మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ భూ నిర్వాసితులను పోలీసులతో తొక్కించిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని, కేసీఆర్, హరీశ్‌రావులకు రూ.వేల కొట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నా, ఎంపీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ వాళ్లు ఎంపీలుగా ఉన్నారని, వాళ్లు మెదక్ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు ఏం చేశారో చూడాలన్నారు. మెదక్ జిల్లా రైతులను ముంచి పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడు బీఆరెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారుని, పెగ్గు మీద పెగ్గు వేసినట్టు కుర్చీ మీద కుర్చీ వేసుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.