ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తిలోదకాలు ఇచ్చేసాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జూన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మారుతారన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని రెండు పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తోందని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. ఇప్పుడు బీజేపీ అదే బాట పట్టినట్లు స్పష్టం ఔతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో బీజేపీ పార్టీ నాయకులు సిద్దహస్తులని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచి పీఠం ఎక్కడం, ఓడి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషించడం ప్రజాస్వామ్యబద్ద పార్టీల విధి. అది మరచిపోయిన బీజేపీ మూడో మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు. కుట్రపూరితంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసిందని ఆయన గుర్తు చేశారు. కాగా, మహారాష్ట్రలో సైతం బీజేపీ అనుసరించిన మోసపూరిత వైఖరిని ఆయన ఎత్తి చూపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా ఓటర్లు భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో పార్టీలను ఏమార్చి తన పబ్బం గడుపుకోవడమే ఆ పార్టీ పంథా అని మంత్రి విమర్శించారు. కానీ, తెలంగాణాలో అలాంటి పప్పులు ఉడకవని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇక్కడ పూర్తికాలం పని చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. సీఎం మారుతారన్న ప్రకటన ద్వారా బీజేపీ రాష్ట్ర ప్రజలకు ఏ సంకేతాలు ఇవ్వదలుచుకుందని ఆయన నిలదీశారు. ఆ ప్రకటన ద్వారా వెన్నుపోటు రాజకీయాలను సమర్థిస్తామన్న తమ మనోగతాన్ని ఆ పార్టీ నేతలు బైట పెట్టుకున్నారని తెలిపారు.
ఇక, రాష్ట్రంలో అధికారం కొల్పోయాక బీఆర్ఎస్ దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు! కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కిన రెండో రోజు నుంచే ఆ పార్టీ నేతలు విషం చిమ్మడం మొదలైందన్నారు. భారత రాష్ట్ర సమితి నేతలది ఫక్తు అధికార దాహం అనీ, ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వం చేజారిన తరవాత ఒక్కక్షణం కూడా ఆగలేకపోతున్నారనీ, కానీ, వాళ్ల పాలనపై వెగటు పుట్టే ప్రజలు గద్దె దించిన విషయాన్ని మరచిపోవద్దని చురకలు వేశారు. అంతా ఊడ్చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది బీఆర్ఎస్ కాదా? రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చిన పాపం గత ప్రభుత్వానిది కాదా? అని మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ సృష్టించిన ఆర్థికసంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను అనుసరిస్తోందని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలతో పాటు ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని తేల్చి చెప్పారు!
బీజేపీ, బీఆర్ఎస్ లు దొందూ దొందే అనీ, కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ ప్రజలను నమ్మించి వంచించాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. లోపాయకారిగా రెండు పార్టీల విధానం, వైఖరిలు ఒక్కటే అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారును కూలదోసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ లు కుమ్మక్కయ్యాయనీ, అందుకే ఆయా పార్టీల నేతలు ఇలాంటి విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పనే అబద్ధాన్ని ప్రచారంలోకి తెచ్చే కుట్ర కూడా ఆ కోవలోనిదే అని తెలిపారు. ఐతే, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, వాళ్ల దుర్బుద్ధిని బైట పెట్టుకోవడం మినహా జరిగేదేం లేదనీ, రెండు పార్టీల నాయకులు ఇకనైనా కళ్లు తెరవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.