Wednesday, April 16, 2025

రాజ్యాంగాన్ని మార్చాలని బిజేపి, బిఆర్ఎస్ కుట్ర

  • రాహుల్ గాంధీ తిరోగమనవాది అనడం అవివేకం
  • రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ..
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అంబేడ్కర్ అందించిన సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో భారత రాజ్యాంగమే లేకుండా చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి బీఆర్ఎస్ చేస్తున్నాయని, ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ భారత్ సంవిధాన్ బచావో అంటూ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు. దేశంలో కులగణన సర్వే చేసి జనాభా దామాషా ప్రకారం సంపద, వనరులు, రాజకీయ అవకాశాలు పంచాలని సామాజిక న్యాయం కోసం ఆలోచన చేస్తున్న రాహుల్ గాంధీని తిరోగమన వాది అనడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఖండించారు.

 

సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని, రాజ్యాంగమే లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ, బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టి, దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు, వోటు హక్కుతో పాటు ఇతర హక్కులు పొందుతున్న ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో అని పిలుపునిచ్చారన్నారు. ఈ సంవిధాన్ తో పాటు దేశంలో కుల గణన చేసి బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ చేస్తున్న ఆలోచన ప్రకారం మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన సర్వే చేయించామన్నారు.

 

ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి, పాస్ చేయడానికి గవర్నర్ కు పంపించామని చెప్పారు. అంతే కాకుండా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేమందరం దిల్లీకి వెళ్లి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఆందోళన చేపట్టినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో కులగణన చేసి 56 శాతం బలహీన వర్గాలు ఉన్నారని లెక్కలతో సహా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కుల గణన సర్వే ద్వారా వొచ్చిన ఆధారంగా ఆస్తులు, వనరులు, సంపద ఎవరి వద్ద ఉన్నాయోనన్న వాస్తవ విషయాలు బయట పెట్టి, సర్వే ప్రకారంగా సంపద పంచే కార్యక్రమం మొదలుపెడితే ఈ దేశంలో తమ ఉనికికే ప్రమాదమని భావించిన బిజెపి, బిఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేక ఆనాడు పీవీ నరసింహారావు దేశంలో భూ సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా కుట్రపూరితంగా అడ్డుకోవడానికి జై ఆంధ్రా ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆనాటి ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టారో బిజెపి, బీఆర్ఎస్ అదే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుండా మిగతా అంశాలను ముందుకు తీసుకువచ్చిందని అన్నారు.

 

బిజెపి బిఆర్ఎస్ పార్టీలు ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా 42 శాతం రిజర్వేషన్ సాధించుకునేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు బహుజనలందరు ఏకమవుతారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి వీరందరూ అండగా ఉంటారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ అందించిన సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని వెల్లడించారు. తరతరాలుగా ఈ దేశంలో అనగదొక్కబడిన వర్గాల కోసం, వెనుకబడిన వర్గాల కోసం ఆలోచన చేసి సమాజంలో వారిని సమాన స్థాయికి తీసుకురావడానికి ప్రత్యేక హక్కులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కల్పించారని వివరించారు. పని చేసే మహిళలకు ప్రసూతి సెలవులు ఉండాలని, ఇతర హక్కులు ఉండాలని, పనిచేసే భారతీయ స్త్రీలకు హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగమని కొనియాడారు. ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించిన భారత రాజ్యాంగమే సకల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com