ఆర్ఎస్ఎస్‌పై ఆధారపడాల్సిన అవసరం ఇప్పుడు బీజేపీకి లేదని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేపీ నడ్డా కీలక అంశాలపై మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముందుడి బీజేపీని నడిపిస్తోందనే అభిప్రాయంపై జేపీ నడ్డా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. గతంలో ఉన్న బీజేపీకి, ఇప్పుడున్న బీజేపీకి చాలా తేడా ఉందన్నారు. అటల్‌జీ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ చాలా బలపడిందని, సొంత సామర్థ్యాన్ని సాధించుకుందని చెప్పారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్‌పై ఆధారపడినా ఇప్పుడా పరిస్థితి మారిందన్నారు. ఆర్ఎస్ఎస్ అవసరం ఇప్పుడు కూడా ఉందని అనుకుంటున్నారా అని నడ్డాను ప్రశ్నించగా, బీజేపీ బాగా బలపడిందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు, పాత్రలను సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక, సామాజిక సంస్థ అని, తమది రాజకీయ సంస్థ అని చెప్పారు. అవసరమా అనేది ఇక్కడ ప్రశ్న కాదని, ఆర్ఎస్ఎస్ ఒక సైద్ధాంతిక ఫ్రంట్ అని చెప్పారు. ఒక పార్టీగా తాము సొంతంగానే వ్యవహారాలు చక్కబెట్టుకుంటామని, సహజంగా అన్ని పార్టీలు చేసేది కూడా అదేనని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని మధుర, వారణాసి వివాదాస్పద స్థలాల్లో ఆలయాల నిర్మాణంపై కొత్తగా అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని నడ్డా వెల్లడించారు. దీనిపై చర్చలు కూడా జరగలేదని, పార్టీ వ్యవస్థ, పనితీరు ప్రకారం, పార్లమెంటరీ బోర్డులో తొలుత డిస్కషన్లు జరుగుతాయని, ఆ తర్వాత నేషనల్ కౌన్సిల్‌కు వెళ్లి దాన్ని ఆమోదించడం జరుగుతుందని చెప్పారు. వివాదస్పద ఆలయాలపై ఎక్కడా చర్చ లేదని, దాన్ని రాద్దాంతం చేయరాదంటూ సూచించారు.