* డ్రగ్స్ దందాలో బీజేపీ నేత కొడుకు
* రాడిసన్‌లో డ్రగ్స్ దందా
* పట్టుబడిన వారిలో ప్రముఖులు
* అల్లు అర్జున్ బిజినెస్ పార్టనర్ కూడా..!
టీఎస్, న్యూస్ : డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు పోలీసులు ఎంతలా ప్రయత్నిస్తున్నా కూడా అది సాధ్యపడటం లేదు. తాజాగా గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్ లో సదరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నాడు. అంతేకాకుండా సినీ హీరో అల్లు అర్జున్ బిజినెస్ పార్టనర్ కేదార్నాథ్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్‌కు హై లైఫ్, జూబ్లీ 800 పబ్ మరియు బఫెలో వైల్డ్ వింగ్స్ పబ్ లలో కేదార్నాథ్ బిజినెస్ పార్టనర్ గా ఉన్నాడు. శెలగంశెట్టి కేదార్నాథ్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్, బడా బిజినెస్ మాన్ కావడంతో పేరు బయటికి రాకుండా దాస్తున్నట్లు అనుమానాలున్నాయి.
యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకుంటున్నారనే పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. 2009లో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద్ కుమారుడు వివేకానంద రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు. హోటల్ కూడా యోగానంద్‌దేనని తెలుస్తోంది. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. వివేకానంద ప్రస్తుతం మంజీరా గ్రూప్స్‌కు కీలక బాధ్యతల్లో ఉన్నాడు.
ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌పై నేడు పోలీసులు జరిపిన దాడిపై సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. రాడిసన్ బ్ల్యూ హోటల్‌పై ఎస్‌ఓటీ పోలీసులతో దాడి చేశామని, హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సెర్చ్ చేశామన్నారు.
అప్పటికే హోటల్ నుంచి నిందితులు పరారు అయ్యారన్నారని, కొంత సమాచారంతో రాడిసన్ డైరెక్టర్ వివేకానంద ఇంటికి వెళ్ళామన్నారు. వివేకానంద మంజీర గ్రూప్‌కి డైరెక్టర్‌గా ఉన్నాడని సీపీ వెల్లడించారు. ఇంటికి వెళ్లిన సమయంలో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారని తెలిపారు. వివేకానందను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశామని అవినాష్ మహంతి వెల్లడించారు. వివేకానందతో పాటు నిర్భయ్ , కేదార్‌కు పాజిటివ్ వచ్చిందని, వివేకానందకు యూరిన్ టెస్ట్ చేయించగా కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందన్నారు. మొత్తం ఈ పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. రాడిసన్ హోటల్‌లో గతంలోనూ పార్టీలు జరిగినట్లు గుర్తించామన్నారు. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి వీరందరికీ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. వివేకానంద, నిర్భయ్, కేదార్‌పై 121b 27, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా తాము అటాచ్ చేస్తున్నామని సీపీ తెలిపారు.