- మరి ఇన్ని కండిషన్లు ఎందుకు ?
- బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఎటువంటి కండిషన్ లేకుండా రుణమాపీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఇన్ని కండిషన్లు ఎందుకు పెడుతున్నారని రేవంత్ రెడ్డి సర్కార్ ను బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ఈ మేరకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న మహేశ్వర్ రెడ్డి రుణమాఫీ మార్గదర్శకాలపై స్పందించారు.. రీ షెడ్యుల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం సబబు కాదని అన్నారు.
చాలా బ్యాంకులలో లోన్ రికవరీ అయ్యి, మళ్లీ కొత్తగా లోన్ ఇచ్చినట్లు బ్యాంకర్లు రైతు పుస్తకాల్లో రాసుకున్నారని ఆయన తెలిపారు. అలాంటి వాటికి రుణమాఫీ వర్తించదని చెప్పడం ఎంతవరకు కరెక్టు అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు రైతులు బలి అవుతున్నారని, ఎందుకీ కండిషన్లు అని ఆయన మండిపడ్డారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, అయితే రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి చాలమంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఒకే రేషన్ కార్డు లో పేర్లు ఉన్న అన్నదమ్ములు భూములు పంచుకుని విడివిడిగా లోన్ తీసకుంటారని, మరి వారి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒక్క రేషన్ కార్డులో నలుగురి మీద లోన్ ఉంటే ఒక్కరికే ఇవ్వడం వలన మిగతా వారు నష్టపోతారని మహేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తే ప్రజాపాలనకు సార్థకత వస్తుందన్నారు.
సర్పంచుల బిల్లులు చెల్లించని రేవంత్ రెడ్డి సర్కార్, ఒక్కరోజు పెండింగ్ లేకుండా మంత్రుల కంపెనీలకు వందల , వేల కోట్లు విడుదల చేస్తున్నరని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే పల్లెబాటు పట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. కడియంతో ఆ మాట అనిపించిందే రేవంత్ రెడ్డి అని ఆయన ఆరోపించారు.