కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
నగరంలోని బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వారిని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లు రువ్వడంతో వివాదం మరింత పెద్దదిగా మారింది. ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో కొందరు గాయపడ్డారు. కొందరు బీజేపీ కార్యకర్తల తల పగిలి రక్తం కారినా వారు నిరసనలో పాల్గొనడం కనిపించింది. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య వివాదాన్ని పెంచుతున్నాయి. రమేష్ బిధూరి ఇటీవల మాట్లాడతూ.. తనను కనుక గెలిపిస్తే కల్కాజీలోని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల్లా అందంగా చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా పెద్ద ఎత్తున కాషాయ శ్రేణులు బీజేపీ ఆఫీసుని ముట్టడించేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.