నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కనీస అవగాహన లేకుండా మహేశ్వర్ రెడ్డి, బిజెపి నాయకులు మాట్లాడుతున్నారన్నారు.
వంద రోజుల పాలనలో తెలంగాణలో అద్భుతమైన పాలన అందించామన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పాలనను ఒక గాడిలో పెట్టి నడిపిస్తున్నామన్నారు. తాము వంద రోజుల పాలనలో అవినీతికి పాల్పడి యూ టాక్స్ వసూలు చేశామని అనడం పచ్చి అబద్ధం, దుర్మార్గమన్నారు. తాను ప్రస్తుతం కుటుంబంతో దైవదర్శనం చేసుకోవడానికి వేరే రాష్ట్రానికి వచ్చానని, నేడు సాయంత్రం హైదరాబాద్‌కు వస్తానని, వచ్చాక మహేశ్వర్ రెడ్డి చేసిన అన్ని రాజకీయ ఆరోపణలకు తగిన జవాబు చెబుతానన్నారు. మంగళవారం మంత్రి దీనికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేశారు.