ఏపీ కోసం బీజేపీ ఆఫర్
పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో ఆఫర్ కూడా వస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్. ఏపీలో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు సినీ గ్లామర్‌ను రంగంలోకి దింపాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సింగిల్ గానే బరిలోకి దిగుతున్నారు. ఇటు జగన్ ఓటమే లక్ష్యం గా టీడీపీ, జనసేన జత కట్టాయి. కాంగ్రెస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించింది. బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుతున్నారు. ఈ సమయంలోనే బీజేపీ “మెగా” స్కెచ్ సిద్దం చేసింది.
తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం సాధ్యమేనని స్పష్టమవుతున్నది. బీజేపీ తమతో కలిసి వస్తుందని, 2014 నాటి పొత్తులు రిపీట్ చేయాలని చంద్రబాబు, పవన్ ఇప్పటికే అంచనాలు వేసుకుంటున్నారు. కానీ, బీజేపీ నుంచి ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా బీసీ నినాదంతో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. ఇటు ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలే కీలకం. బీజేపీ ఇప్పుడు ఇదే అంశం ఆధారంగా కొత్త లెక్కలకు సిద్ధమైంది.
రాజ్యసభకు చిరంజీవి
బీజేపీ ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగిస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతోనే తమ పొత్తు అనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. టీడీపీతో కలుస్తుందా లేదా అనేది తేల్చటం లేదు. ఇటీవల పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. పవన్ తో పొత్తు ద్వారా కాపు మెజార్టీ వర్గం తమ వైపు ఉంటుందని భావిస్తోంది. అయోధ్య రామాలయం ద్వారా వర్గాలకు అతీతంగా తమకు మద్దతు పెరిగినట్లు అంచనా వేస్తోంది. ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. ఇక, ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్య నేతల సమాచారం. పార్టీలకు అతీతంగా ఈ నియామక ప్రక్రియ ఉంటుంది. సినీ రంగం నుంచి 2022లో విజయేంద్ర ప్రసాద్ ను నియమించారు. ఇప్పుడు చిరంజీవికి అవకాశం ఇవ్వటం ద్వారా కొత్త వ్యూహం సిద్ద చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ-2లో కేంద్ర మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. పవన్ తో పొత్తు కొనసాగిస్తూ..చిరంజీవికి రాజ్యసభకు పంపటం ద్వారా ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తోంది. నామినేటెడ్ కోటాలో ఈ ఏడాది నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. మరి..బీజేపీ ఆఫర్ ను సినిమాల్లో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్న చిరంజీవి ఆంగీకరిస్తారా అనే అనుమానాలు వస్తున్నా.. ఇప్పటికే కేంద్రంలో మంత్రిపదవి అనుభవించిన చిరంజీవి.. రాజ్యసభకు ఒకే అంటారని భావిస్తున్నారు.