- ప్రియాంకగాంధీపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలకు నిరసన
- పరస్పర దాడులకు తెగబడిన ఇరు పార్టీల కార్యకర్తలు
- నాంపల్లి బిజెపి కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి
- ప్రతిగా గాంధీభవన్‌పై దాడికి దిగిన బిజెపి శ్రేణులు
- రంగంలోకి దిగి చెదరగొట్టిన పోలీసులు
బిజెపి, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర దాడులతో హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలోని ఈ రెండు పార్టీ ఆఫీసుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై దిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రమేష్ బిదురి వ్యాఖ్యలకు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.
రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసి, రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ దాడిలో ఓ బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనికి ప్రతిగా, కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తరవాత బిజెపి కార్యకర్తలు దాడికి దిగడంతో గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పెద్దఎత్తున గాంధీ భవన్ వద్దకు చేరుకున్న కాషాయం కార్యకర్తలు అక్కడ ఉన్న ప్లెక్సీలను చించివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.
తెలంగాణలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిని దురదృష్టకరంగా అభివర్ణిస్తూ, ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నారు. దాడి అనంతరం, బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ పోలీసులు అప్రమత్తమై బీజేపీ శ్రేణులను అడ్డుకోవడంతో, గాంధీభవన్ వైపుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేస్తుండగా, పోలీసులు వారిని నియంత్రించేందుకు లాఠీచార్జ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, ఈ ఘటన తర్వాత బీజేపీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.