కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి విజయం సాధించారు. హోరా హోరీగా కొనసాగిన పోరులో రెండో ప్రాధాన్యత వోట్లతో ఆయన గెలుపొందారు. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపో యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలవగా, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు.
కరీంనగర్- మెదక్- నిజా మాబాద్- ఆదిలాబాల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,52,007 మంది తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 27,671 వోట్లు చెల్లనవి ఉన్నాయి. 2,24,336 వోట్లు చెల్లడంతో 1,12,169 వోట్లను అధికారులు కోటాగా ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత వోట్లతో పాటు 53 మంది ఎలిమినేషన్ అనంతరం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 78,635 వోట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 73,644, బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి 63,404 ఓట్లు వచ్చాయి.
మొత్తం 56 మంది పోటీలో ఉండగా 53 మందికి కలిపి కేవలం 17,244 వోట్లు మాత్రమే వొచ్చాయి. అనంతరం మూడో స్థానంలో నిలిచిన ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేశారు. బిఎస్పీ అభ్యర్థి హరికృష్ణకు పడిన రెండో ప్రాధాన్యత వోట్లలో అత్యధికం బిజెపి అభ్యర్థికే పడ్డాయి. అయితే నిర్ణయించిన మేరకు అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలుపు వోట్లను సాధించలేదు. దీంతో రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని ఎలిమినేషన్ చేసే ప్రక్రియ మొదలైంది. ఇందులో కూడా బిజెపి అభ్యర్థికే అత్యధిక రెండో ప్రాధాన్యత వోట్లు పడతాయి. అందువల్ల బిజెపి అభ్యర్థి విజయం సాధిస్తారు. అధికారికంగా తుది ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.