కృష్ణ జింకలను వేటాడిన కేసులో మరోసారి బాలీవుడ్ తారలు చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్ నటీనటులు సైఫ్ అలీఖాన్, టబు, నీలం, సొనాలీ బింద్రేలను నిర్దోషులుగా తేల్చుతూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల సవాల్ చేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ అభ్యర్థనను విచారణకు స్వీకరించిన ఉన్నతన్యాయస్థానం ఇదే వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న మిగితా పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది.
1998 అక్టోబర్ 1న హమ్ సాత్ సాత్ హే షూటింగ్ సమయంలో జోధ్‌పూర్ పరిసర ప్రాంతాల్లో బాలీవుడ్ తారలు కొందరు కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే దీనిపై బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, టబు, నీలం, సోనాలీ బింద్రేతో పాటు స్థానికుడు దుష్యంత్ సింగ్‌లపై కేసు నమోదు అయ్యింది. అనంతరం విచారణ జరిపిన జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు 2018 ఏప్రిల్ 5న నటుడు సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేలుస్తూ ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సైఫ్ అలీఖాన్, టబు, సొనాలీ బింద్రే, దుష్యంత్ సింగ్‌లను తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. వీరిని నిర్దోషులుగా విడుదల చేయడంపై రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన విచారణను జూలై 28న రాజస్థాన్ హైకోర్టు.. సల్మాన్ శిక్షపై ఆయన వేసిన అపీల్‌తో పాటు ఇతర నటులపై ప్రభుత్వ అప్పీల్‌ను కూడా విచారించనుంది. దాదాపు 25 సంవత్సరాలుగా న్యాయస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ శిక్షకు సంబంధించిన వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది.
అయితే కృష్ణ జింకల వేటాడిన కేసు అప్పట్లో పెను సంచలనమే. కృష్ణ జింకలు అరుదైన జాతి జంతువులు. భారత దేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం దక్షిత జాతిగా వీటిని గుర్తించారు. వీటి వేట పూర్తిగా చట్ట విరుద్ధమని ఈ చట్టంలో పేర్కొన్నారు. కేసు నమోదు అయి దాదాపు 25 ఏళ్లు ట్రయల్ కోర్టులోనే కొనసాగింది. ఆ తరువాత సల్మాన్ దోషిగా తేల్చుతూ ట్రయల్ కోర్టు శిక్ష విధించగా.. ఆపై సల్మాన్ బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఈ కేసును సల్మాన్ హైకోర్టులో దాఖలు చేయగా.. అక్కడ ఉపశమనం లభించలేదు. దీంతో సల్మాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.