కరోనా తరువాత చాలా వరకు అన్ని పరిశ్రమల్లో మార్పులు వచ్చాయి. ఇక సినీ పరిశ్రమ అయితే చెప్పక్కర్లేదు. అందులోనూ బాలీవుడ్ పరిశ్రమ బాగా దెబ్బతినిందనే చెప్పాలి. ఒక్క హిట్ కూడా లేక బాలీవుడ్ అంతా అల్లాడుతుంది. గడిచిన రెండు మూడేళ్లలో షారూఖ్ ఖాన్ అందించిన రెండు భారీ విజయాలు, శ్రద్ధా కపూర్ స్త్రీ 2 .. కొన్ని మడాక్ సినిమాలు, గదర్ 2 మినహా ఇండస్ట్రీలో పెద్ద విజయాలేవీ లేవు. దీంతో బాలీవుడ్ లో అసలు సమస్య ఏమిటో విశ్లేషించే ప్రయత్నం మొదలైంది. నిజానికి హీరోల భారీ పారితోషికాలపై చాలా నిరాశ నెలకొంది. అంతేకాదు.. సుభాష్ ఘయ్ లాంటి సీనియర్ దర్శకుడు రచయితల్ని సరిగా గౌరవించకపోయినా, వారికి చెల్లించాల్సిన పారితోషికం సవ్యంగా అందకపోయినా దాని ప్రభావం ఇండస్ట్రీపై పడుతుందని విశ్లేషించారు. వారిని ఏడిపిస్తే దాని ప్రతిఫలం ఇండస్ట్రీ అనుభవిస్తుందని అన్నారు. తన సినిమాలకు పని చేసిన రచయితలు కష్టంలో ఉన్నామని చెబితే మొత్తం పారితోషికాన్ని ఒకేసారి క్లియర్ చేసేవాడిని అని కూడా తెలిపారు. చాలా మంది బాలీవుడ్ లో సరైన కథలు లేవని విమర్శిస్తున్నారు. దీనికి కారణం రచయితల్ని చూడాల్సిన విధానంలో చూడకపోవడమేనని కూడా అంటున్నారు. దీనిపై ఇండస్ట్రీ దిగ్గజాలు కొందరు ఇటీవలి చర్చా సమావేశాల్లో తీవ్రంగా విశ్లేషించారు. బాలీవుడ్ లో ఒరిజినల్ కథల పుట్టుక సరిగా లేకపోవడానికి రచయితలను గౌరవించకపోవడం ప్రధాన కారణం కావొచ్చని చాలా మంది అంగీకరించారు. హాలీవుడ్ లో స్క్రిప్టు రచయితలకు చాలా ప్రాధాన్యత ఎక్కువ. దర్శకుడితో సమానంగా రచయితలకు టైటిల్ కార్డ్ పడుతుంది. జావేద్ – అక్తర్, సిద్ధార్థ్ ఆనంద్, విజయ్ కృష్ణ ఆచార్య లాంటి కొందరు అరుదైన రచయితలకు మాత్రమే సరైన గౌరవం దక్కుతోంది. కొంతమంది దర్శకులు తమ కథల్ని తామే రాసుకోవడం వల్ల కూడా మూసధోరణికి ఆస్కారం కల్పించిందని సమావేశాల్లో చర్చించారు. ఇంతకీ మరి కనీసం ఈ సమావేశం అనంతరమైన దీనికి ప్రత్యామ్యాయం ఆలోచిస్తారా.