మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో తాను ఎదుగుతూ చాలా మంది ఎదుగుదలకి కారణం అయ్యారు. ఎంతో మంది వర్తమాన నటుల్ని చిత్రాన్ని స్వయంగా ప్రోత్సహించారు. చిరంజీవి ఇన్సిపిరేషన్ తోనే ఇండస్ట్రీకి వచ్చామని శ్రీకాంత్ లాంటి హీరోలు చెబుతుంటారు. అయితే చిరంజీవి ఒక కమెడియన్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇంతకీ చిరంజీవి చెప్పింది టాలీవుడ్ నవ్వుల రారాజు బ్రహ్మానందం గురించి. సినిమాల్లోకి రాకముందు బ్రహ్మానందం లెక్చరర్ గా పనిచేసేవారు. బ్రహ్మానందం నటించిన తొలి చిత్రం చిరంజీవి, జంధ్యాల కాంబినేషన్ వచ్చిన చంటబ్బాయ్. ఈ చిత్రంలో బ్రహ్మి చిన్న పాత్రల్లో నటించారు. జంధ్యాల ద్వారా బ్రహ్మికి ఆ అవకాశం వచ్చింది. అప్పటికి బ్రహ్మి గురించి ఎవరికి తెలియదు.
జంధ్యాల బ్రహ్మీని తనకి పరిచయం చేశారు అని చిరంజీవి తెలిపారు. బ్రహ్మి అప్పట్లో మిమిక్రీ చాలా బాగా చేసేవారు. ఇతనిలో మంచి ట్యాలెంట్ ఉంది అనిపించింది. నేనంటే బ్రహ్మికి చాలా అభిమానం. వీలైనంత వరకు నాతోనే ఉండేవాడు. ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలోనే ఉండాలి అని నాకు అనిపించింది. వైజాగ్ లో చంటబ్బాయ్ షూటింగ్ ముగిసిన తర్వాత బ్రహ్మీని నాతోపాటు చెన్నైకి ఫ్లైట్ లో తీసుకెళ్ళాను.
బ్రహ్మికి మంచి అవకాశాలు వచ్చే వరకు మా ఇంట్లోనే ఉండేలా ఏర్పాట్లు చేశాను. నేను ఏ స్టూడియోకి వెళ్లినా అక్కడికి బ్రహ్మీని తీసుకెళ్ళేవాడిని. సినిమా ఈవెంట్స్ కి తీసుకెళ్ళేవాడిని. బ్రహ్మి ట్యాలెంట్ గురించి సినిమా పెద్దలకు చెప్పి ప్రోత్సాహించినట్లు చిరంజీవి పేర్కొన్నారు. ఇదంతా దాదాపు 40 ఏళ్ళ క్రితం 1986లో జరిగింది. కట్ చేస్తే బ్రహ్మి టాలీవుడ్ లో అగ్ర కమెడియన్ గా ఎదిగారు. వందలాది చిత్రాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా అందుకున్నారు.