Saturday, January 18, 2025

బ్రిజేష్‌ ఆదేశాలు కేసీఆర్‌ ప్రభుత్వ విజయమే..

కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్‌ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై మాజీ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు నిర్విరామంగా కేసీఆర్‌ చేసిన పోరాటానికి వొచ్చిన ఫలితమే బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తాజా ఉత్తర్వులని ఆయన  పేర్కొన్నారు. ఇది కేసీఆర్‌ ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన విజయమని స్పష్టం చేశారు. కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచి కేసీఆర్‌ చేసిన వాదనతో ఎట్టకేలకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఏకీభవించడం వల్ల నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కొట్లాడి సాధించిన విజయాన్ని సైతం తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్‌ పార్టీ భావదారిద్య్రానికి నిదర్శనం అన్నారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ గొప్పతనమని ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

ఏపీ పునర్విభజన చట్టం, సెక్షన్‌ 89ని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీనే తెచ్చిందన్నారు. కృష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే, దాన్ని సరిదిద్దడానికి పదేండ్ల కాలం పట్టిందన్నారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కులు సాధించేందుకు ఆనాడు కేసీఆర్‌ సీఎం హోదాలో బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు హాజరై తెలంగాణ పక్షాన వాదనలు వినిపించారని, దీంతో తెలంగాణకు న్యాయం దక్కే అవకాశాలు మెరుగు పడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు అయిన నెల రోజులకే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో, ఆనాటి సాగునీటి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలంటూ 14.7.2014 నాడే లేఖ రాసినట్లు తెలిపారు. అయితే కేంద్రం ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ చట్టానికి బదులుగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 89 ప్రకారం విచారణకు ఆదేశించింది. ఈ విచారణ వలన తెలంగాణకు న్యాయమైన వాటా లభించే అవకాశం లేదని సీఎం కేసీఆర్‌ భావించారు. అందుకే ఆయన నిరంతరాయంగా ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ యాక్ట్‌  1956, సెక్షన్‌ 3 ప్రకారం పున: పంపిణీకి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ వొచ్చారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం 2015లోనే నాటి కేసీఆర్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. అక్టోబర్‌ 2020 లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఇదే అంశంపై తీవ్రంగా పట్టుబట్టినట్లు గుర్తు చేశారు.

కేసీఆర్‌ ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్‌ కి రిఫర్‌ చేయడానికి అంగీకరించిందన్నారు. అయితే కేసు విరమించుకున్న తక్షణమే ట్రిబ్యునల్‌ వేసేందుకు హామీ ఇవ్వాలని కెసిఆర్‌ పట్టు బడితే, మేము న్యాయ మంత్రిత్వ శాఖ సలహా తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని నాడు కేంద్ర మంత్రి అన్నారని తెలిపారు. కేంద్ర మంత్రి షెఖావత్‌ ను మరోసారి దిల్లీలో కలిసిన తర్వాత ఆయన హామీ మేరకు నాటి ముఖ్యమంత్రి కెసిఆర్‌ కేసును విత్‌ డ్రా చేయాలంటూ అధికారులను ఆదేశించారని తెలిపారు. కెసిఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం 2021 జూన్‌ లో విత్‌ డ్రా పిటిషన్‌ వేసింది. సుప్రీం కోర్టు అక్టోబర్‌ 2021 లో పిటిషన్‌ అనుమతించిందన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్టోబర్‌ 2023వ తేదీనే సెక్షన్‌ 3 కింద నీటి విభజన కోసం ట్రిబ్యునల్‌ కు కేంద్ర ప్రభుత్వం టర్మ్స్‌ ఆఫ్‌ రెఫెరెన్స్‌ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు ఎన్నో వేదికల ద్వారా బీఆర్‌ఎస్‌ చేసిన పోరాట ఫలితమే తాజాగా సెక్షన్‌ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలన్నారు.

ఒకవైపు సెక్షన్‌ 3 ప్రకారం నీటి వాటా జరగాలని శాశ్వత పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే, మరోవైపు తాత్కాలికంగా నీటి వాటాను 50 శాతం పెంచాలని పోరాటం కొనసాగించామన్నారు. ఇందులో భాగంగానే ట్రిబ్యునల్‌ ముందు 575 టిఎంసి ల నీటి వాటా డిమాండ్‌ పెట్టినట్టు గుర్తు చేశారు. కేఆర్‌ఎంబీ సమావేశాల్లో, కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల్లో ట్రిబ్యునల్‌ తీర్పు వొచ్చేదాకా తెలంగాణకు కృష్ణా జలాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని నిరంతరాయంగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తూనే వొచ్చిందన్నారు. తెలంగాణ దశాబ్దాలుగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను కోల్పోయింది. కనుక సెక్షన్‌ 3 కింద విచారణ త్వరితగతిలో పూర్తి చేసి న్యాయమైన వాటా వచ్చే విధంగా చేయాలని ట్రిబ్యునల్‌ ను బీఆర్‌ఎస్‌ పక్షాన కోరుతున్నామని హరీష్‌ రావు చెప్పారు.  సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణా నదీ జలాల కేటాయింపులపై ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ప్రకటించిన నేపథ్యంలో పటిష్టమైన వాదనలు వినిపించేలా నిష్ణాతులైన న్యాయవాదులను ఎంపిక చేసుకోవాలని హరీష్‌ రావు సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com