- కరువు విషయంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలి
- కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌లు కరువు గురించి బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నాయని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి, బిఆర్‌ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. దేశంలో అనేకసార్లు తీవ్రమైన కరువు వచ్చిందని, కరువును అధిగమించడానికి ప్రణాళికతో ఆనాడు రాజశేఖర్ రెడ్డి కేంద్రానికి నివేదిక పంపారని కోదండ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కరువు విషయంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన సూచించారు.
యూపిఏ ప్రభుత్వం 2013లో కరువు విషయంలో సవరణ చేసిందని, 28 రాష్ట్రాల కంటే ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు కరువు ఎక్కువ సాయం చేసిందన్నారు. తాగునీరు, సాగు నీరు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పరిస్థితుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారని, కష్టకాలంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్రాన్ని నిలదీయాలన్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ హాయంలోనే పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపిం చారు. అప్పుడు రాహుల్ గాంధీ రైతు కుటుంబాలను పరామర్శించారని ఆయన తెలిపారు.