Saturday, December 28, 2024

10 నెలల్లో అమలు చేసిన పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలి

బిఆర్‌ఎస్, బిజెపి చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పి కొట్టాలి
ఈ ఏడాది రాష్ట్రంలో 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతాం
టిపిసిసి విస్తృతస్థాయి సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకుసాగాలి
టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికి తీసుకెళ్లాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో గురువారం సాయంత్రం టిపిసిసి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ నాయకులు, కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి మాట్లాడుతూ బిఆర్‌ఎస్, బిజెపి చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పి కొట్టాలని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మహిళలకు ఉచిత ఆర్టీసి పథకాన్ని అమలు చేశామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ప్రయాణిస్తున్న రవాణా డబ్బులను ప్రజా ప్రభుత్వం ఆర్టీసికి ప్రతినెలా రూ.400 కోట్లు చెల్లిస్తుందన్నారు. మార్చి నెల నుంచి 200 యూనిట్స్‌లోపు గృహ విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. రైతులకు అందిస్తున్న ఉచిత కరెంట్, పేదలకు అందిస్తున్న విద్యుత్ సబ్సిడీ సంబంధించిన డబ్బులను ప్రతినెల ప్రభుత్వం రూ. 1,150 కోట్లు భరిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 500 గ్యాస్ సిలిండర్‌తో కాంగ్రెస్ వంట గదిలోకి కూడా వెళ్లిందన్నారు. ఒక కుటుంబానికి సంవత్సరంలో కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోవడానికి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడికి గుండె ధైర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని ఆయన తెలిపారు.

స్థానిక సంస్థల్లో అన్ని స్థానాలు గెలుచుకునేలా: టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రజా పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కులగణనపై చర్చించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేలా ప్రజల్లోకి…
ప్రభుత్వంపై ప్రతిపక్ష బిఆర్‌ఎస్, బిజెపిలు విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టేలా తగిన విధంగా కాంగ్రెస్ ప్రచారం ఉండాలని పిసిసి అధ్యక్షుడు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఇన్ని రోజులు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పూర్తిగా అవగాహన చేసుకొని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ, ఆర్టీసిలో మహిళలకు ఇచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్, 50 వేల ఉద్యోగ నియామకాలతో పాటు కాంగ్రెస్ చేసిన కార్యక్రమాల ఘనతను ఇంటింటికి ప్రతి కార్యకర్త తీసుకువెళ్లాలన్నారు. ఇప్పటికే అనేకమందికి కార్పొరేషన్ పదవులు, డిసిసి అధ్యక్ష, అనుబంధ సంఘాల చైర్మన్ పదవులు వచ్చాయని ఇంకా చాలా పదవులు ఇవ్వాల్సి ఉందన్నారు. పార్టీ కోసం పని చేసిన అందరికీ పదవులు ఇవ్వడానికి తాము ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com