Sunday, October 6, 2024

బిజెపితో బిఆర్‌ఎస్ చీకటి ఒప్పందం

  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు
  • పార్టీ ఫిరాయింపులనై మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్ నాయకులకు లేదు
  • ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

బిజెపితో బిఆర్‌ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసమే తమ ప్రయత్నమని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపులనై మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్ నాయకులకు లేదని, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ల స్ఫూర్తిని కెసిఆర్ తుంగలో తొక్కారని, అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మంత్రి ఆరోపించారు.

ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం బిఆర్‌ఎస్ నడుచుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. తెలంగాణ వస్తే చాలు- మరే పదవి వద్దన్న మాజీ సిఎం కెసిఆర్ జాతీయ పార్టీగా బిఆర్‌ఎస్‌ను విస్తరించి ప్రధాని కావాలని కలలు కన్నారని ఆయన ఆరోపించారు. సారు.. కారు.. పదహారు అన్న కెసిఆర్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న సీట్లు పోవడంతో పాటు డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి జూపల్లి ఎద్దేవా చేశారు.

ఆనాడు రాచరిక వ్యవస్థతో పాలన సాగింది
అవినీతి సంపాదనతో ఆనాడు కెసిఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి ఆరోపించారు. రాచరిక వ్యవస్థతో పాలన సాగింది కాబట్టే ప్రజలు తప్పు చేయకుండా మిమ్మల్ని దించితే ప్రజలు తప్పు చేశారంటూ బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. విలువలు ఉండి ఉంటే ఆనాడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని విలీనం చేసే వాడు కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని నిరంజన్ రెడ్డి నీతులు వల్లిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని జూపల్లి విమర్శించారు.

ప్రజలు కాంగ్రెస్ పాలనను మెచ్చే కెసిఆర్‌కు పార్లమెంటులో సున్నా ఇచ్చారన్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేసిన బిఆర్‌ఎస్ పార్టీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు వీడుతున్నారన్నారు. సుస్థిర ప్రభుత్వం కోసమే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సంతోష్‌కు రాజ్యసభ ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిరంజన్ రెడ్డిని మంత్రి జూపల్లి నిలదీశారు. కెసిఆర్, నిరంజన్ రెడ్డిలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాహుల్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు కెసిఆర్, నిరంజన్ రెడ్డిలు మానుకోవాలని మంత్రి జూపల్లి సూచించారు. విభజన సమస్యల పరిష్కారానికే ఇరు రాష్ట్రాల సిఎం లు సమావేశమయ్యారని మంత్రి జూపల్లి తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular