పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన షకీల్ ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్ తల్లి బుధవారం కన్నుమూశారు. గురువారం అచన్‌పల్లిలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్‌కు కాగా.. అక్కడికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కాగా కొన్ని నెలలుగా షకీల్ దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కోసం పోలీసులు కొంతకాలంగా వెతుకుతున్నారు. కేసులు నమోదు అయినప్పటి నుంచి ఆయన దుబాయ్‌లో ఉంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై చాలా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో అరెస్టు తప్పదని గ్రహించి దుబాయ్ వెళ్లిపోయారు. దుబాయ్‌లో ఉన్న షకీల్‌పై పోలీసులు అరెస్టు వారెంట్, లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించిన షకీల్‌ను రప్పించలేకపోయారు. అయితే ఇంతలో అనారోగ్యంతో తల్లి మృతి చెందారు. షకీల్ రాక తప్పలేదు. వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్ కుమారుడు కూడా హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.
షకీల్ కుమారుడు రాహిల్ ఆమిర్ 2022లో జూబ్లీహిల్ జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో శిశువు చనిపోయాడు. తర్వాత 2023 డిసెంబర్‌లో కూడా అలాంటి ప్రమాదం జరిగింది. ప్రజాభవన్ ముందు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీ కొట్టి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తే సంబంధం లేని వ్యక్తులను అందులో ఇరికించేందుకు యత్నించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులతో కుమ్మక్కై అతన్ని తప్పించారని విచారణలో తేలింది. హిట్ అండ్ రన్ కేసులో కుమారుడిని తప్పించడంలో షకీల్‌దే కీలక పాత్ర అని పోలీసులు అనుమానించారు. ఈ దిశగానే కేసును విచారించారు. కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ఆయన పాత్రను కన్ఫామ్ చేశారు.
కేసు నమోదై విచారణ సాగతున్న టైంలోనే షకీల్ కూడా దుబాయ్ పారియారు. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తండ్రీకుమారుడు దుబాయ్‌లో తలదాచుకున్నారు. షకీల్ పూర్తి పేరు మొహమ్మద్ షకీల్ ఆమిర్. బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి 2014, 2018 రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. అప్పటి కాంగ్రెస్ అబ్యర్థి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. తర్వాత 2024 ఎన్నికల్లో మాత్రం అదే సుదర్శన రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.