Sunday, November 17, 2024

కేసీఆర్ సెంటిమెంట్.. 51 మందితో తొలి జాబితా విడుద‌ల

2014లో తెలంగాణ సెంటిమెంటుతో, రెండోసారి వివిధ ఆకట్టుకొనే పథకాలతో గెలిచి మూడోసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం కేసిఆర్. అయితే ఈసారి గెలుపు అంత ఈజీ కాదనే సత్యం ఆయ‌న‌కు అర్థ‌మైన‌ట్లు ఉంది. పైకి ప్రతిపక్ష పార్టీల‌ను ఎండగడుతూనే మూడోసారి ప్రజల మద్దతుతో మళ్ళీ అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ లోలోపల ఎక్కడో డబుల్ బెడ్‌రూములు, ద‌ళితుల‌కు మూడు ఎక‌రాలు, కేజీ టు పీజీ, దళిత‌బంధు, బీసీబంధు, ముస్లీం రిజ‌ర్వేష‌న్లు, ఉద్యోగుల జీతాలు, పీఆర్సీ, రైతు రుణమాఫీ, నిరుద్యోగుల‌ ఆందోళనలు, ఉద్యోగుల టీచర్ల బ‌దిలీలు, ఎమ్మెల్యేల అవినీతి, కూతురు లిక్కర్ స్కామ్ వంటివి ఆయ‌న్ని ఎక్క‌డో భ‌య‌పెడుతున్నాయి. ఎందుకంటే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ బ‌లం పుంజుకుంది. బీజేపీ తెలంగాణ‌లో అడ్ర‌స్ లేకుండా పోయింది. పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజి, విద్యార్థుల ఆందోళనలు, పార్టీలో నాయకుల తిరుగుబాటు.. హన్మకొండ, భూపాలపల్లి, మోరాంచపల్లి వంటి ప్రాంతాల్లో వ‌ర్షం వ‌ల్ల ఆస్తి, ప్రాణ న‌ష్టం.. ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాల ఆగ్ర‌హం వంటి అంశాలు ఆయ‌న్ని పున‌రాలోచ‌న‌లో ప‌డేసే అంశాలు.

గతంలో 2018 శ్రావణ సోమవారం శుభ దినంగా భావించినట్లే ఈసారికూడా అదే శుభదినాన 21వ తేది మ‌ధ్యాహ్నం.. సమయంలో బీఆర్ఎస్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించ‌నున్నట్లు సమాచారం. తాము నిర్వహించుకున్న‌ సర్వే.. రెండు మూడు నియోజకవర్గాల్లో పార్టీ గొడవల కారణంగా అభ్య‌ర్థుల్ని ఆచితూచి ఎన్నుకుంటార‌ని తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సమాచారం వెలుగుకి వచ్చిన దృష్ట్యా కేసీఆర్.. తన తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల్లో ఇతర పార్టీ అభ్యర్థులను అంచనా వేస్తూ స‌రైన‌ అభ్యర్హుల్ని బ‌రిలో దింపేలా ప్రయత్నాలు సాగుతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని వివిధ కారణాల చేత మార్పు చేయాల‌ని భావించినా.. ఆ ప్రయోగాలు బెడిసికోడతాయని సిట్టుంగులకే సీట్లు కట్టబెడుతున్నట్లు అవ‌గ‌త‌మ‌వుతోంది. ఏది ఏమైనా గతంలో సునాయసంగా చక్రం తిప్పినా.. ఈసారి మాత్రం చెమ‌టోడ్చ‌క త‌ప్ప‌ట్లేద‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది.

సీట్లు ఎవ‌రికి?
ఈ క్రమంలో తిరిగి అదృష్టం వ‌రించే బీఆర్ఎస్ స‌భ్యులు ఎవ‌ర‌నే విష‌యంలో కొంత ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బాల్క సుమన్, జోగు రామన్న, రాథోర్ బాబురావు బోథ్, ఆత్రం సక్కు, ఇంద్రకరణ్ రెడ్డి , జీవన్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, గణేష్ బీగాల, భాజరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, కేటీఆర్, రసమయి బాలకిషన్, కోరుగంటి చందర్, విద్యాసాగర్ రావు, సతీష్ బాబు, హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్‌, గూడెం మహిపాల్ రెడ్డి వంటి వారికి టికెట్లు ప‌క్కాగా ఇస్తార‌ని స‌మాచారం.

* మల్లారెడ్డి, మైనంపల్లి హన్మంత రావు,కేపీ వివేకానంద, మాధవరం కృష్ణా రావు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, అరికపూడి గాంధీ, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి వంటి సిటింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్లు గ్యారెంటీ అని తెలిసింది. హైదరాబాద్లో ముఠా గోపాల్, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు వంటి వారికి సీట్లు ప‌క్కా అని స‌మాచారం.

* గాదరి కిషోర్, పైళ్ల‌ శేఖర్ రెడ్డి, గొంగిడి సునీతా, రేగా కాంత రావు , బానోతూ హరిప్రియ నాయక్ , పువ్వాడ అజయ్ కుమార్, సండ్ర వెంకట వీరయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మా రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, రవిచంద్ర, కడియం శ్రీహరి, పల్ల‌ రాజేశ్వర్ రెడ్డి, ఆరూరి రమేష్, గండ్ర రమణ రెడ్డి వంటివారు మొద‌టి జాబితాలో ఉంటార‌ని స‌మాచారం. అయితే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన త‌ర్వాత‌.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ల‌ను ఆశిస్తున్న వారి అసంతృప్తిని కేసీఆర్ ఎలా ప‌రిష్క‌రిస్తాడ‌నే అంశాన్ని వేచి చూడాల్సి ఉంటుంది.

-VN SUNDER, SENIOR JOURNALIST

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular