- లిక్కర్ కేసును దృష్టి మళ్లించే యత్నం
- ఎమ్మెల్సీ కవితపై ఆది శ్రీనివాస్ విమర్శలు
బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు శారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని అడిగారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉందని.. బీసీ నాయకత్వంలో సమస్యలను పరిష్కరిం చుకుంటామని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలతో అసలు కవితకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బీసీలపైన మొసలి కన్నీరు, కపట ప్రేమ కవిత చూపిస్తోందని మండిపడ్డారు. అగ్రకులాల చెప్పు చేతల్లో ఉద్యమాలు చేయాల్సిన కర్మ బీసీలకు లేదన్నారు. లిక్కర్ కేసును జనం దృష్టి మళ్లించడానికి కవిత బీసీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. లిక్కర్ దందాలో ఆరు నెలలు జైలులో ఉండొచ్చిన కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తున్నారని.. బీసీ రిజర్వేషన్లు పెంచేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.‘కల్వకుంట్ల కవిత నాయకత్వంలో బీసీల సమస్యలను పరిష్కరించుకొనే కర్మ మాకు పట్టలేదు‘ అంటూ వ్యాఖ్యలు చేశారు. కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా? అని నిలదీశారు. దేశానికి కులగణనలో తెలంగాణ రోల్ మోడల్‌గా మారిందని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ధ్యేయంగా కులగణన జరిగిందన్నారు. రాహుల్ గాంధీ సూచనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారని తెలిపారు. గిరిజనులు, మైనార్టీలకు12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. అప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని అన్నారు.
బీసీ కార్పొరేషన్‌తో పాటు ఇతర కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బీసీకు రుణాలు ఇవ్వకుండా మొండి చేయి చూపించారన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క పైసా నిధులు ఇవ్వలేదన్నారు. కులగణనపైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని అన్నారు. సామాజిక, ఉపాధి, విద్యా, రాజకీయంగా బీసీ వాటా కులగణనతో తేలిపోతుందని… దానికి అనుగుణంగా వాటా దక్కుతుందన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నట్లు కవిత ఆరోపణల్లో అర్థం లేదన్నారు. గందరగోళాన్ని సృష్టించడం కోసం ఆమె డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తామని కవిత అంటున్నారని.. సభ నిర్వహించడానికి కవిత ఎవరటూ విరుచుకుపడ్డారు. కవిత నాయకత్వంలో జరిగే సభకు బీసీలు ఎవరూ హాజరుకావొద్దని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.