Saturday, January 18, 2025

నీటి వాటాల పాపం బీఆర్ఎస్ దే

కృష్ణా జలాలను పదేండ్లుగా పట్టించుకోని బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి  విమర్శించారు.  కృష్ణా జలాల నదీ వివాదానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పరీవాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని కాంగ్రెస్‌ పార్టీ తొలినుంచి పోరాటం చేస్తోంద‌ని, నదీ జలాల వాటాలు దక్కించుకోవడంలో తొలి పదేండ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ ఘోరంగా విఫలమైంద‌న్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది నెలలకే 2015 జూన్లో అప్పటి టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో వాటాల వినియోగానికి సంబంధించి ఒప్పందం చేసుకుంది.  ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు వాడుకునేలా ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఈ చీకటి ఒప్పందంతోనే తెలంగాణ తీరని అన్యాయం జరిగింది. ఈ తాత్కాలిక కేటాయింపులపై ప్రతి ఏడాది సంతకాలు చేసింది బీఆర్ఎస్ లీడర్లు కాదా..?  అని ప్ర‌శ్నించారు.

కృష్ణా జలాల వాటాలను తేల్చాలని పోరాటం చేయకుండా ఎందుకు తాత్కాలిక కేటాయింపులకు సంతకాలు చేశారు. కృష్ణా జలాలపై మీరు ఆడిన నాటకాలను అసెంబ్లీలో నిలదీసి శ్వేత పత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.  మొత్తం 811 టీఎంసీల్లో ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతం బీఆర్ఎస్ ఒప్పుకొని అన్యాయం చేస్తే… కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా రావాలని, ఏపీకి 30 శాతం కేటాయించాలనే వాదనను లేవనెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. భౌగోళికంగా నదీ పరివాహక ప్రాంతానికి అనుగుణంగా, అంతర్జాతీయ నీటి ఒప్పందాల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల కోసం పట్టుబట్టింది, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అని అన్నారు.  తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం వైఖరిని కాంగ్రెస్ నిలదీసినందుకే సెక్షన్‌ (3) అంశం తెరపైకి వొచ్చింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టెర్మ్స్‌ ఆప్‌ రిఫరెన్స్‌ (టీఓఆర్‌)కు ఓకే చెప్పింది. ఇందులో బీఆర్ఎస్ గొప్పతనమేమీ లేదు.

బీఆర్ఎస్ లీడర్లు చేసిందేమీ లేదు.  నదీ జలాల వాటాలను తేల్చకుండా జాప్యం జరగడంలో బీఆర్ఎస్ ప్రధాన దోషి. వాళ్ల హయాంలో తెలంగాణకు అన్యాయం.. ద్రోహం జరిగింది.  ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాటైన బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువును కేంద్రం పలుమార్లు పొడగించింది. నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ కేటాయింపులు జరిగేలా గడిచిన పదేండ్లలో ఎందుకు ఒత్తిడి చేయలేదు..?   మేం అధికారంలోకి వ‌చ్చిన తర్వాతనే బ్రిజేష్ ట్రిబ్యునల్ ద్వారా తొందరగా నీటి కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాం.  మహబూబ్‌న‌గర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు నష్టపోతుంటే కళ్లప్పగించి ప్రేక్షక పాత్ర పోషించింది ఎవరు..?  బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలించింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని అదనంగా మరో 44 వేల క్యూసెక్కులకు పెంచింది.  కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేస్తే.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఎందుకు చూసీ చూడనట్లు నటించింది.

రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే దాకా అపెక్స్ మీటింగ్ కు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టింది నిజం కాదా..?  గోదావరి జలాలను రాయలసీమ దాకా తీసుకెళ్లి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పిందెవరు… కేసీఆర్ కాదా?  కృష్ణా, గోదావరి జలాల వాటాలను కొట్లాడి తెచ్చుకోవాల్సింది పోయి.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే నాటకాలాడింది మీరు.. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.  పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా నీళ్లు తరలిస్తుంటే, అప్పుడు అధికారంలో ఉన్న హరీష్‌రావు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.  బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అవార్డు కాకుండానే ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్‌ కుడి కాల్వ విస్తరణ పనులు చేపడితే.. ఎందుకు చర్యలు తీసుకోలేదు.

1978 గోదావరి అవార్డు ప్రకారం… పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని చెబుతోంది. ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున అక్కడ రావాల్సిన 45 టీఎంసీల నీటి వాటా తెలంగాణకే దక్కాల‌న్నారు. పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని బచావత్ అవార్డు తెలిపింది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఏపీకి తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45టీఎంసీల వాటా దక్కాలి కదా.. అప్పుడే మీరు పట్టుపడితే, నిజంగానే పోరాడితే తెలంగాణ నీటి వాటా 90 టీఎంసీల వరకు పెరిగేది కదా..? ఆ నీటి వాటాలు ఎందుకు తెచ్చుకోలేదు..? అది ఎవరి వైఫల్యం..? అని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌శ్నించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com