గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో మోసం
బిఆర్‌ఎస్ ప్రభుత్వం 22ఏ (నిషేధిత జాబితాను) ఆధారంగా చేసుకొని భూ కుంభకోణానికి పాల్పడిందని, శామీర్ పేట మండలం తూముకుంట గ్రామంలో 164,/1 లో 26 ఎకరాల అటవీ భూమిని జూన్ 2022వ తేదీన ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందని జాతీయ కిసాన్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు కోదండ రెడ్డి ఆరోపించారు. శనివారం గాంధీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూముకుంట గ్రామంలోని సర్వే నెంబర్ 260/2 ,261 ,265/8 361/7 361/9 డిఫెన్స్ ల్యాండ్‌ను బాలాజీ అసోసియేట్ అనే సంస్థకు కట్టబెట్టారన్నారు. బొంరాష్ పెట్ గ్రామంలో 1,065 ఎకరాల ప్రైవేటు భూమిని అసలైన రైతులకు దక్కకుండా సంతోష్ కుటుంబానికి చెందిన ఎఫ్4ఎల్ ఫామ్స్‌కు ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యడు 23ఎకరాల నిషేధిత భూమిని భూమిని రిజర్వేషన్ చేసుకున్నారన్నారు. గత ప్రభుత్వం వేల ఎకరాల రైతుల భూములను పూర్తిగా నిషేధిత జాబితాలో పెట్టి, ఎన్నికలు అవ్వవగానే అంబూజ్ అగర్వాల్ పేరున రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. 24లక్షల అసైన్డ్ భూమిని నిషేధిత జాబితాలో పెట్టి వాళ్లకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టిందన్నారు.
మల్టీ నేషనల్ కంపెనీకి భూమిని అమ్ముకున్నారు
హెచ్‌ఎండిఏను అడ్డుపెట్టుకొని, పేదల భూమిని లాక్కొని అప్పటి ప్రభుత్వం వేలం వేసిందని ఆయన ఆరోపించారు. చేవెళ్ల మండలం చందనవెల్లిలో 15 వందల ఎకరాలు దళితుల రైతుల దగ్గర లాక్కొని ఎకరాకు తొమ్మిది లక్షలు అప్పటి ప్రభుత్వం చెల్లించిందన్నారు. కెటిఆర్ తనకు అనుకూలంగా ఉన్న మల్టీ నేషనల్ కంపెనీకి రూ.కోటి 30 లక్షలకు ఆ భూములను అమ్ముకున్నారని, అన్ని సమగ్ర ఆధారాలతో ప్రభుత్వానికి నివేదిస్తున్నానని ఆయన తెలిపారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము అప్పటి ప్రభుత్వానికి వీటిపై ఫిర్యాదు చేశామని, అయినా పట్టించుకోలేదన్నారు. మాజిల్ పూర్ గ్రామంలో ఆనాడు ల్యాండ్ సీలింగ్‌లో పోయిందని, 25 ఎకరాల భూమిని పట్టా చేశారన్నారు. అక్రమాలను అన్ని బయట పెట్టి, ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
కుట్ర పూరితంగానే ధరణికి రూపకల్పన
బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయంతో ఎంతోమంది చనిపోయారన్నారు. కుట్ర పూరితంగానే కెసిఆర్ ధరణికి రూపకల్పన చేశారన్నారు. అవకతవకలపై మొత్తం కెసిఆర్, కెటిఆర్ లే భాగస్వాములని ఆయన ఆరోపించారు. రెవెన్యూ శాఖ కెసిఆర్ దగ్గర ఉందని, ఐటి శాఖ కెటిఆర్ దగ్గర ఉందని, కుంభకోణాలకు మొత్తం కెటిఆర్, కెసిఆర్‌లే బాధ్యులన్నారు. కెటిఆర్, కెసిఆర్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు కాగానే, ఎంత పెద్ద వారైనా వదలొద్దని, చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానన్నారు. అప్పటి సిఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో భూ కుంభకోణం జరిగిందని, భారత దేశంలోనే అతి పెద్ద కుంభం కోణం బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. రెవెన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.