Sunday, November 17, 2024

ప్రభుత్వానికి కూల్చివేత తప్ప పూడ్చివేత చేతకాదు

సాగర్ కాలువ గండి పడి
22 రోజులవుతున్నా పూడ్చలేదు
పోయిన ఏడాది ప్రకృతి కరవు తెస్తే
ఇప్పుడు కాంగ్రెస్ కరవు తెచ్చింది
కొందరు పోలీసులు ప్రభుత్వానికి
తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
అలాంటి వారు ఎపి తరహా
పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది
చట్టాలకు లోబడి మాత్రమే పోలీసులు పనిచేయాలి
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు చేతకాదని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు విమర్శించారు. సాగర్ కాలువ గండి పడి 22 రోజులవుతున్నా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో పంటపొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్నా జిల్లాలో పొలాలు ఎండుతున్నాయని మండిడపడ్డారు. పాలేరు జలాశయానికి 100 మీటర్ల దిగువన సెప్టెంబర్ 1న కాలువకు గండి పడిందని, గండి పడి 22 రోజులవుతున్నా పూడ్చలేదని ధ్వజమెత్తారు. సాగర్ నిండుకుండలా ఉన్నా సాగర్ ఆయకట్టు రైతుల పంటలు ఎండుతున్నాయని, పోయిన ఏడాది వర్షాలు పడక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్ల పంటలు ఎండుతున్నాయని విమర్శించారు.

పోయిన ఏడాది ప్రకృతి కరవు తెస్తే ఇప్పుడు కాంగ్రెస్ కరవు తెచ్చిందని వ్యాఖ్యానించారు. పంటలు ఎండబెట్టడమే తొమ్మిది మంది ఎంఎల్‌ఎలను గెలిపించిన ఖమ్మం ప్రజలకు ఇచ్చే బహుమానమా..? అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూలుస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వరదల్లో పంట నష్టపోయిన రైతులతో సమానంగా పంట ఎండిపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా సాగర్ కాలువ గండి పూడ్చి రైతులకు నీళ్లు ఇవ్వాలని హరీశ్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలు వడ్డిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్, సండ్ర వెంకటవీరయ్య తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేశారు.. తొమ్మిది మంది ఎంఎల్‌ఎలను గెలిపించడం పాపమా..? అని ప్రశ్నించారు. యుద్ధప్రాతిపదికన గండి పూడ్చి మిగిలిన పంటలనైనా కాపాడాలని కోరారు. బిఆర్‌ఎస్ తరపున ఒక బృందం ఖమ్మం వెళ్లి రైతులకు భరోసా కల్పిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తోంది : తమపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు అని, పోలీసు అధికారులు రెచ్చిపోవద్దని హితవు పలికారు. ఎపిలో ఏమైందో పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందరు పోలీస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ఎపి తరహా పరిణామాలు ఎదుర్కోవటానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. చట్టాలకు లోబడి మాత్రమే పోలీసులు పనిచేయాలని హితవు పలికారు. బిఆర్‌ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. కొందరు పోలీసు అధికారాలు తీరు మార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో గుండాయిజం పెరిగిపోయిందని పేర్కొన్నారు. అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని, తొమ్మిది నెలల కాలంలో 2 వేల అత్యాచారాలు జరిగాయని తెలిపారు. నర్సాపూర్‌లో ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి బాధాకరమని హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తోందని, ఇంటిపైకి వెళ్లి దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి : శ్రీధర్ బాబుకు హరీష్ రావు కౌంటర్
అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. మీటింగ్ అరికెపూడి గాంధీ నియోజకవర్గంలో జరిగిందని ముఖ్యమంత్రిని మర్యాదకపూర్వంగా కలవడానికి వెళ్ళాడంట అని శ్రీధర్ బాబు మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. అరికెపూడి గాంధీ సిఎల్‌పి సమావేశానికి వచ్చారని, ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు మానండి.. అని తాను ట్వీట్ చేశానని, దాని మీద మంత్రి శ్రీధర్ బాబు తనకున్న చాకచాక్యాన్ని, తెలివితేటలను ఉపయోగించి మాట్లాడారని ఎద్దేవా చేశారు. సిఎల్‌పి మీటింగ్ గాంధీ నియోజకవర్గంలో జరిగిందట.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చారని శ్రీధర్ బాబు అన్నారని, అధికారిక మీటింగ్‌కు సిఎం వస్తే.. మర్యాదపూర్వకంగా కలిసేందుకు వస్తారు తప్ప.. పార్టీ మీటింగ్‌కు రారు అనే విషయాన్ని శ్రీధర్ బాబు గ్రహించాలని సూచించారు. అరికెపూడి గాంధీ అయితే నియోజకవర్గం కాబట్టి సిఎల్‌పి సమావేశానికి వెళ్లారని, మరి ప్రకాశ్ గౌడ్ ఎందుకు వచ్చారు..?.. కడియం శ్రీహరి ఎందుకు వచ్చారు..? అని నిలదీశారు. అబద్దం ఆడితే అతికేటట్టు అయినా ఉండాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నగ్నంగా బయటపడిందని, ఎవరేం చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular