Monday, November 18, 2024

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 800ల చెరువులను కబ్జా చేశారు

  • హైడ్రాకు రాహుల్ గాంధీకి సంబంధం ఏమిటీ..?
  • మూసీ చుట్టూ ఉన్న వారికి చట్టబద్దంగా నష్ట పరిహారం చెల్లిస్తాం
  • పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
  • రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకురావడం కెటిఆర్ అవివేకానికి నిదర్శనం
  • రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

10 ఏళ్లలో బిఆర్‌ఎస్ నేతలు చెరువులు, కుంటలను యథేచ్ఛగా కబ్జాలు చేశారని, ఇప్పటివరకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారుగా 800ల చెరువులను కబ్జా చేశారని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. బిఆర్‌ఎస్ నాయకులు హైడ్రా విషయంలో రాహుల్ గాంధీకి సంబంధం ఉందని ఆరోపణలు చేసిన నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడితో పాటు మంత్రి పొన్నంలు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం వారు గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీకి హైడ్రాకు ఏమి సంబంధమని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. హైడ్రా ఉండాలని అందరూ కోరుకుంటు న్నారని ఆయన తెలిపారు. మూసీ చుట్టూ ఉన్న ఒక్క ఇల్లును కూడా ఇప్పటివరకు తొలగించలేదని ఆయన తెలిపారు. మూసీ చుట్టూ ఉన్న వారికి చట్ట బద్దంగా నష్ట పరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు.

డిపిఆర్ రెడీ కానప్పుడు అవినీతి ఎలా జరిగింది..?
హైడ్రా పేరు మీద ఒక్క రూపాయి వసూలు చేయలేదని, ఆరోపణలు కాదు దానిని నిరూపించాలని పిసిసి అధ్యక్షుడు బిఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. హైడ్రా వల్ల బిఆర్‌ఎస్ నేతలు బాధ పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మూసీ అభివృద్ధికి సంబంధించి డిపిఆర్ తయారు కానప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందన్నారు. ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్‌లోని చెరువులకు పూర్వవైభవం వస్తుందన్నారు. మూసీ వేరు హైడ్రా వేరని ఆయన తెలిపారు.

మూసీ ప్రక్షాళన చేస్తామని గతంలో కెసిఆర్ చెప్పిన విషయాన్ని పిసిసి అధ్యక్షుడు గుర్తు చేశారు. కెసిఆర్ ఎక్కడ దాక్కున్నారో కెటిఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ వాళ్లు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సోషల్ మీడియా నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. మధు యాష్కీ మాట్లాడిన మాటల్లో తప్పు లేదని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని చెట్ల పేరు మీద, లిక్కర్, ఇరిగేషన్ పేరు మీద బిఆర్‌ఎస్ దోచుకుందని, 10 ఏళ్లలో బిఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేశారని ఆయన ఆరోపించారు. తీన్మార్ మల్లన్న మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు.

కెటిఆర్ మాటలను ఖండిస్తున్నా: మంత్రి పొన్నం
రాహుల్ గాంధీపై కెటిఆర్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని, చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహారించాలని కెటిఆర్‌కు సూచిస్తున్నానని రవాణా శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకురావడం కెటిఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. అసలు మూసీపై బిఆర్‌ఎస్ పార్టీ వైఖరి ఏమిటన్నది తెలియచేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఒక ఇల్లు కూలగొట్టమని, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. వీలైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతతో నిర్మాణాత్మక సూచనలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ బిఆర్‌ఎస్ నాయకులకు సూచించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular