ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆమెను వైద్య చికిత్స కోసం దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ కేసులో ఆమె మార్చి 15న అరెస్ట్ అయ్యారు. అనంతరం ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక కోర్టు రౌస్ అవెన్యూ వాదనల అనంతరం తిహార్ జైలుపంపారు. ఇప్పటివరకు అనేక మార్లు సీబీఐ, ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో కవిత బెయిల్ కోసం ఆమె సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆమెకు బెయిల్ లభించలేదు. కవిత అనారోగ్యానికి గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు.
గతంలోనే అనారోగ్య సమస్యలతో కవిత బాధపడ్డారు. ఈ సమస్యలను పేర్కొంటూ బెయిల్ ఇవ్వాలని కూడా కోర్టుకు విన్నవించారు. కానీ, రౌస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. కొడుకు పరీక్ష కోసం మధ్యంతర బెయిల్ కోసం కూడా ఆమె దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. జైలులో నుంచి ఆమె కోర్టుకు రాసిన ఓ లేఖ సంచలనమైంది. తాను అమాయకురాలినని, ఈ కేసులో ఇరికించారని ఆమె పేర్కొన్నారు. ఏ ఆధారం లేకుండానే తనను జైలులో పెట్టారని ఆరోపించారు.
కాగా కవితను కవితను బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్‌లు ఒకసారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కలిసి వచ్చారు. ఇటీవలే మాజీ మంత్రి హరీశ్ రావు కూడా కవితను జైలులో కలిసి పరామర్శించి వచ్చారు. ఈ కేసులో నుంచి ఆమె తప్పకుండా బయటపడుతుందని, ధైర్యంగా ఉండాలని సూచించారు. వీరందరి కంటే ముందు కేటీఆర్ కూడా ఆమెను కలిశారు. బెయిల్ విచారణ సందర్భంగా కవిత కుటుంబ సభ్యులు ఆమెను కలిసి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.