Thursday, August 29, 2024

హీరో నుంచి జీరోకు బీఆర్ఎస్ ​బాస్​కు గడ్డుకాలం

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్ మరింత బలహీనపడుతూ వస్తోంది. గతంలో కేసీఆర్‌ను హీరో అంటూ ప్రశంసించిన వాళ్లే.. అధికారం పోయే సరికి.. కేసీఆర్ జీరో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదంటూ చాలామంది గులాబీ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు ఎక్కువమంది మొగ్గు చూపిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఆ సీటును కాంగ్రెస్ గెలవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38కి చేరింది.

ప్రస్తుతం 9 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది. అదే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3వంతు వేరే పార్టీలో చేరితే పార్టీ శాసనసభా పక్షం విలీనమైనట్లు పరిగణిస్తారు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తించదు. ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తం 26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే 9మందిని చేర్చుకోగా.. మిగిలిన 17 మందిని మరో 15 రోజుల్లో చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బీఆర్‌ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని.. ఇద్దరు నుంచి ముగ్గురే ఆ పార్టీలో మిగులుతారంటూ దానం సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఏం జరిగిందంటే..
2019 ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ సంపూర్ణ మెజార్టీ సాధించినప్పటికీ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసేలా స్కెచ్ వేసి సక్సెస్ అయ్యారు. ఐదేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ను గద్దెదించి.. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించారు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకునే పనిలో పడిందనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ మాత్రం తమ ప్రభుత్వ పనితీరు, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని చెబుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వరని.. ఆ పార్టీలో నేతలు ఇమడలేకపోతున్నారని.. త్వరలోనే ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. మరో 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని.. ఆ పార్టీలో మిగిలేది ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమేనన్నారు.

దీంతో కాంగ్రెస్ ఇప్పటికే మిగతా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో దానం నాగేందర్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అండతో అక్రమాలకు పాల్పడిన వాళ్లను వదిలిపెట్టబోమని.. అందరి పేర్లు బయటకు తీస్తామని హెచ్చరించారు. కొంతమంది పేర్లను సైతం దానం నాగేందర్ బయటపెట్టారు. జైలుకు వెళ్లి వచ్చినోళ్లు కోట్ల రూపాయిలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అందరి సంగతి తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే దానం నాగేందర్ బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంతకాలం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈటల రాజేందర్‌ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన సమయంలోనూ గులాబీ బాస్‌కు మద్దతుగా నిలిచారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్‌, పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

రేవంత్ ప్లాన్..?
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక ఎమ్మెల్యే సీటును గెల్చుకోలేదు. దీంతో రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్యా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామంటూ దానం నాగేందర్‌కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో గ్రేటర్ పరిధిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే పూర్తి బాధ్యతల్ని దానం నాగేందర్ తన భుజస్కందాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలవడంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో మేయర్. ఛైర్మన్ పదవులు గెలవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఓ టార్గెట్‌ను ఫిక్స్ చేసి.. బీఆర్‌ఎస్ మొత్తాన్ని ఖాళీ చేయాలనే హస్తం పార్టీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
- Advertisment -

Most Popular