- కెటిఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు: వాళ్లది ట్యాపింగ్ ఫ్యామిలీ
అధికారం పోయిన మూడు నెలలకే బిఆర్‌ఎస్ పార్టీ పతనమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంత తక్కువ సమయంలో పతనం కాలేదన్నారు. సికింద్రాబాద్ ఎంపి స్థానాన్ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో సికింద్రాబాద్ పార్లమెంటరీ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థి దానం నాగేందర్ మంత్రి కోమటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దానంతో పాటు 2023 ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, రోహిణి రెడ్డి, ఆదాం సంతోష్ కుమార్, ఫిరోజ్ ఖాన్, పి.విజయ, కోట నీలిమలు పాల్గొన్నారు.
మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుతో హైదరాబాద్ విశ్వనగరంగా….
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుతో హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపి సీట్లు గెలవడం ఖాయమని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. కెటిఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు అని మంత్రి విమర్శించారు. వాళ్లది ట్యాపింగ్ ఫ్యామిలీ అని మంత్రి ఆరోపించారు. కెసిఆర్ చేసిన పాపాలవల్ల రాష్ట్రంలో వర్షాలు పడడంలేదన్నారు. హరీశ్ రావు మాటలకు అర్థం లేదని మంత్రి కోమటిరెడ్డి దుయ్యబట్టారు. ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా హరీష్ రావుకు బుద్ధి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. బిఆర్‌ఎస్ కుటుంబ పాలన వల్ల కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో లేకున్నా ఈ సారి గెలిచామన్నారు. కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందన్నారు. రూ.40వేల కోట్లతో మూసీ ప్రాజెక్టును ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తామన్నారు.
సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ స్థానాలను తప్పకుండా గెలుస్తాం
బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పార్టీలు మారే మహేశ్వర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ బిజెపిలో ఉన్న మహేశ్వర్ రెడ్డి, రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. మహేశ్వర్ రెడ్డికి దమ్ముంటే ప్రధాని మోడీ ఇచ్చిన హామీలపై మాట్లాడాలన్నారు. మైక్ దొరికింది కదా అని ఏదీ పడితే అది మాట్లాడొద్దని ఆయన హితవు పలికారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ స్థానాలు తప్పకుండా గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ను కిషన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ ను పట్టించుకోలేదని, అభివృద్ధి చేయలేదన్నారు. కిషన్‌రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడని అది సాధ్యం కాదన్నారు.
8వ తేదీన మరోసారి మీటింగ్
తుక్కుగుడా బహిరంగ సభకు 10 లక్షల మందిని తరలిస్తామన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ తుక్కుగూడ సభను నిర్వహిస్తామన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివస్తామని కార్యకర్తలే చెబుతున్నారన్నారు. వారి ఉత్సాహం, ప్రజల స్పందన చూస్తుంటే తుక్కుగూడ సభ పది లక్షలకు మించిపోయేలా ఉందన్నారు. సికింద్రాబాద్ ఎంపిగా నాగేందర్ ను గెలిపించే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు. దానం నాగేందర్‌ను గెలిపించే బాధ్యత తనదేనని ఆయన తెలిపారు. 8వ తేదీన నాంపల్లి లో ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో మరో సారి మీటింగ్ ఉందన్నారు. బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాను సమన్వయ కర్తను మాత్రమేనని, స్థానిక నాయకులందరు ఉన్నారని, గతంలో కూడా సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ 2 సార్లు ఎంపిగా ఉన్నారని, వారితో కలిసి ఇప్పుడు మన నాగేందర్ గారిని గెలిపిస్తామన్న నమ్మకం ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనసులో పెట్టుకోకుండా కార్యకర్తలంతా కలిసిమెలసి పనిచేయాలన్నారు. రాబోయే పదిసంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, కార్యకర్తలు, నాయకులందరం కలిసి కష్టపడి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కాళేశ్వరంలో, యాదగిరిగుట్టలో అవినీతి
హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కట్టించిందని, ప్రస్తుతం ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా తాను ప్రయత్నం చేసి నేషనల్ హైవే, రీజనల్ రింగ్ రోడ్డులు రానున్న రోజుల్లో సూపర్ గేమ్ చేంజర్‌గా మారబోతున్నాయన్నారు. త్వరలోనే దానికి కూడా శంకుస్ధాపన చేయబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దేవుడి పేరుతో కట్టిన కాళేశ్వరంలో అవినీతి, దేవునిగుడి కట్టిన యాదగిరిగుట్టలో అవినీతి, మహిళ లిక్కర్ వ్యాపారం చేయడం, కొడుకు మంది ఫోన్లు వినే ట్యాపింగ్ చర్యలకు పాల్పడటాన్ని దేవుడు కూడా తట్టుకోలేదన్నారు. అందుకే గత వర్షాకాలం తగినంత వర్షాలు పడలేదన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో వర్షాకాలం వచ్చి వర్షాలు పడకపోతే ఆ కరువును కాంగ్రెస్ పార్టీపై నెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు.