ప్రజలే చందాలేసుకొని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు
సుప్రీంకోర్టు తీర్పుతో సర్కార్ కళ్లు తెరవాలి
అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో కుదరదు..
మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లేదని..అవసరమైతే ప్రజలే కూలుస్తారని,మాజీ మంత్రి కేటీఆర్. అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమేనన్నారు. కాంగ్రెస్ సర్కార్ ను కూలగొట్టేందుకు ప్రజలే చందాలు కూడా ఇస్తామంటున్నారని చెప్పారు. కానీ ఐదేళ్లు రేవంతే సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ కానీ అవసరం కానీ తమకు లేదన్నారు. సీఎంకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలి..అపుడే జనం ఏమనుకుంటున్నారో తెలుస్తుందన్నారు. కొందరు పోలీసులు రేవంత్ రెడ్డి సైన్యంలా పనిచేస్తున్నారని అన్నారు.
ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తే పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తదని హెచ్చరించారు. . వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు,బిల్డర్లు తెలంగాణలోని సర్కార్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని.. ప్రభుత్వాన్ని కూల్చాలంటూ తమకు సలహాలు ఇస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..దీనిపై కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో మళ్లీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట మార్చి తమకు ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన లేదని అన్నారు. ఈ క్రమంలో గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ.. ‘అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వారికి తావు లేదని అన్నారు. నిన్న సుప్రీంకోర్టులో వాదోపవాదాలు విన్న సగటు పౌరుడికి న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగింది’ అంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆధికారులను జైలుకు పంపినా తప్పు కాదు’ అన్న వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ, ఇది ప్రభుత్వానికి పెద్ద నింద అని పేర్కొన్నారు.
అలాగే ఆత్మాభిమానమున్న ఏ సీఎం అయినా ఇలాంటి పరిణామాల అనంతరం రాజీనామా చేస్తారు. కానీ, రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానమే లేదు అంటూ విమర్శించారు. ఈ వివాదంలో పర్యావరణ ప్రేమికుల విజయం సాధించారని కేటీఆర్ అన్నారు. ఈ భూముల యాజమాన్యంపై స్పష్టత వొచ్చే వరకూ కట్టడాలు నిర్మించకూడదు, లీజుకు ఇవ్వకూడదు అని సెంట్రల్ కమిటీ- చెప్పింది. ఇది మేము గత వారం చెప్పిన మాటలే అని పేర్కొన్నారు. ఇది ఉద్దేశ్యపూర్వక విధ్వంసమని, స్వతంత్ర విచారణ సంస్థల ద్వారా దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ‘సీబీఐ, సీబీసీ లేదా సుప్రీంకోర్టు జడ్జీలతో విచారణ చేయించాలి. లేకుంటే మోదీ కూడా దీనిలో భాగం అనే అనుమానం ప్రజల్లో ఉత్పత్తి అవుతుంది అని హెచ్చరించారు. రోహిత్ వేముల ఘటన సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారని గుర్తు చేసిన కేటీఆర్, ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.