- ముగిసిన ఈడీ విచారణ..
- దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7 గంటలపాటు ఈడీ అధికారులు కేటీఆర్‌ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. నగదు బదిలీ చుట్టూనే ఈడీ ప్రశ్నలు తిరిగాయని, నిబంధనలు పాటించకుండా పౌండ్ల లోకి మార్చి పంపడంపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపుపైనే ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
నిధుల బదలాయింపులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ ప్రశ్నించింది. అయితే.. ఈ విచారణ సందర్భంగా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్బంగా, బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
దీంతో పోలీసుల వ్యవహారంపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా, కేటీఆర్ విచారణ సందర్భంగా బషీర్ భాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే అరవింద్‌కుమార్, బీఎల్ ఎన్ రెడ్డిని విచారించి విషయం తెలిసిందే.. అరవింద్‌కుమార్, బీఎల్ ఎన్ రెడ్డి స్టేట్‌మెంట్ల ఆధారంగా కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించారు.