కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున కేసీఆర్ ఏర్పాటు చేశారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. తమ మీద అక్కసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయున్ని నిర్భంధించి కాంగ్రెస్ ప్రభుత్వం, అవమానిస్తోందని విమర్శిం చారు. కాంగ్రెస్ నిర్బంధిస్తున్నది బీఆర్‌ఎస్ నేతలను కాదని, అంబేడ్కర్‌నని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక మీ ఉద్దేశమేంటని ప్రశ్నించారు.
దళితబంధు తొలగించి అంబేడ్కర్ అభయహస్తం తెస్తామన్నారని, ఇప్పటి వరకు దాని అమలు ఊసేలేదని విమర్శించారు. దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారిపై దండిగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతామని చెప్పారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేదని, కావాలని అడుక్కుంటే రాదని ఎద్దేవా చేశారు. కనీసం నెల రోజులు సమావేశాలు జరగాలన్నారు. సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రతిష్టిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా లేదా కాంగ్రెస్ తల్లి విగ్రహమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా లోగోలు, నంబర్ ప్లేట్లు మారాలా అని ధ్వజమెత్తారు.
గురుకులాల్లో 48 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. బీఆర్‌ఎస్ గురుకుల బాటను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీని అడ్డుకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుతాడని, అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టని విమర్శించారు. రాహుల్ గాంధీ చెప్పేదొకటి చేసేదొకటన్నారు. మీ సీఎంకు జ్ఞానోదయం చేయాలంటూ రాహుల్ గాంధీకి సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టారని విమర్శించారు. ఉద్యమ సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నారని చెప్పారు. నాలుగేండ్ల తర్వాత ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలో.. ఎక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలో అక్కడికి పంపిస్తామన్నారు.
బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌కు ఉన్న తేడా ఇదే.?
ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడాన్ని బీఆర్‌ఎస్ పార్టీ తప్పుబట్టింది. అంబేడ్కర్ విగ్రహానికి కనీసం నివాళులర్పించకుండా నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. రాహుల్ గాంధీ జీ.. అంబేడ్కర్‌ను అవమానించాలని మీరేమైనా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
అంబేడ్కర్‌కు నివాళి అర్పిస్తే.. నిర్బంధమా.?
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టించిన అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా నిర్భంధిస్తారా..? అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. ఇది దళితుల మీద కక్ష్యా..? మహనీయులు అంబేడ్కర్ మీద వివక్షా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్తున్న పలువురు బీఆర్‌ఎస్ నేతలను కాంగ్రెస్ సర్కార్ గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఈ హౌస్ అరెస్టులపై కేటీఆర్‌ఎస్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతాడు. ఆ రాజ్యాంగం రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ గౌరవంగా తెలంగాణ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన సగౌరవంగా ప్రతిష్టించారు. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం రేవంత్ కనీసం మహనీయుడు అంబేద్కర్ జయంతి, వర్ధంతులకు కనీసం దండేసి, దండంపెట్టి స్మరించుకునే అవకాశం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.